సిపిఐ ఆధ్వర్యాన నిరసన
ప్రజాశక్తి-సీతమ్మధార: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెంచిన వంటగ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఐ నాయకులు జీ వామనుమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్‌లో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ధర్నాను ఉద్దేశించి వామనుమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లో డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ, అధికారపగ్గాలు చేపట్టి ఎనిమిదేళ్లవుతున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, ధరలను తగ్గించకపోగా, రివర్స్‌లో ఆకాశాన్నంటేలా ధరలను పెంచుకుంటూపోయి, ప్రజలను నమ్మించి నయవంచనకు గురిచేశారని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని, పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమిస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచక తప్పదని హెచ్చరించారు. ధరాభారంతో దేశవ్యాప్తంగా పేద మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న మోడీ సర్కార్, గుజరాత్‌లో అతని గ్రూపునకు రూ 10 లక్షల కోట్ల రాయితీలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. వంటగ్యాస్, ఇతర ధరలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని అధికార ఉన్న వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపితోపాటు బిజెపి దత్తపుత్రుడైన పవన్‌కల్యాణ్ ఉద్యమించాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాకి తప్పదని హెచ్చరించారు. పెంచిన గ్యాస్ ధరుపై ఎంపీలు మంత్రులు తమ వైఖరిని ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు కార్యక్రమంలో సిపిఐ నాయకులు అబ్దుల్ రజాక్, కాండ్రేగుల రాము, బి రాము, పి సాయి, ఎ.కృష్ణ, పి ప్రసాద్, సూరిబాబు పి జయలక్ష్మి రణబీర్ సింగ్ పాల్గొన్నారు.










