Mar 27,2023 23:59

ఆందోళన చేస్తున్న కార్మికులు, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలపై పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం పరిశ్రమల ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణల ఫలితంగా పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి యూనిట్‌కు రూ.1.50 చొప్పున పెంచి సంవత్సరానికి సుమారు రూ.300 కోట్లు భారం మోపుతుందని తెలిపారు. దీని వల్ల పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని, వేలమంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపనుందని చెప్పారు. కొత్త పరిశ్రమలు రప్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఉన్న పరిశ్రమలను నష్టాల్లోకి నెట్టే విధానాలను అనుసరించడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా, పరిశ్రమల యజమానులు, ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.రాము, మండల కార్యదర్శి కె.సోమినాయుడు, నాయకులు రమణమూర్తి, సత్యవతి, వర్మ, నర్సింగరావు, ఎస్‌ఇజెడ్‌లోని మైతాన్‌, అభిజిత్‌, ఆర్సిఎల్‌, సుందరం, సన్నివేరా తదితర ఫెర్రో ఎల్లాయిస్‌ కార్మికులు పాల్గొన్నారు.