Sep 27,2023 19:58

రాజంపేట : ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు

రాజంపేట అర్బన్‌ : పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ట్రూ ఆఫ్‌ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్‌ బిల్లుల భారాలు వ్యతిరేకిస్తూ బుధవారం ఆర్‌డిఒ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్‌.చంద్రశేఖర్‌, చిట్వేలి రవికుమార్‌, పందికాళ్ల మణి మాట్లాడుతూ విద్యుత్‌ బిల్లుల మోతతో ప్రజలకు షాక్‌ కొట్టిస్తున్న ప్రభుత్వ విధానాలు, ప్రజలు తిప్పికొ ట్టాలని పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 2022 కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ బిల్లు చట్టం తెచ్చిందని విమర్శించారు. ఫిక్స్‌డ్‌ ఛార్జీలు, సర్వీస్‌ ఛార్జీలు, కస్టమర్‌ ఛార్జీలు, విద్యుత్‌ సుంకం, ట్రూ ఆఫ్‌ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్‌ మీటర్లు బిగించేందుకు ఛార్జీల పేరుతో విద్యుత్‌ వాడుక బిల్లు కన్నా, ప్రభుత్వ అవసరాల ఆదాయ బిల్లులే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్‌ యూనిట్‌ ధర భారీగా పెంచారని, అసలు ఛార్జీల కన్నా కొసరు ఛార్జీలు ఎక్కువగా కస్టమర్‌ సేవల పేరుతో ప్రజలను నిలువు దోపిడీ పాలక ప్రభుత్వాలే చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రజలపై విద్యుత్‌ భారాలు మోయలేని విధంగా వేసి అమలు చేస్తున్నారన్నారు. మీటర్‌ నిర్వహణ ఛార్జీలు విధిస్తున్నారని తెలిపారు. సెల్‌ ఫోన్లకు ఎలా రీఛార్జ్‌ చేసు కుంటున్నామో, విద్యుత్‌ బిల్లులను రీఛార్జ్‌ చేసుకునే పద్ధతి తీసుకొచ్చి అమలు చేయనున్నారని చెప్పారు. ప్రపంచ బ్యాంకు సంస్కరణల షరతులు అమలులో భాగంగానే విద్యుత్‌ ఛార్జీలు పెంచారన్నారు. రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి విద్యుత్‌ ఉద్యమంలో అమరులైనారని, నేటి 23 ఏళ్లయిందని, ప్రజల ప్రాణాలు పోతే తప్ప పాలకులు కళ్ళు తెరవని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. నేటి మోయలేని విద్యుత్తు భారాలు తగ్గేవరకు బషీర్‌బాగ్‌ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. విద్యుత్‌ ఛార్జీలు నూటికి నూరు శాతం పెంచి నిర్బంధంగా వసూలు చేస్తున్నారన్నారు. టు ఆఫ్‌ ఛార్జీల పేరుతో ప్రజల నుంచి డబ్బు పాలకులు పిండుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2022 విద్యుత్‌ చట్టం రాకముందే రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం 2021లోనే రూ.3,669 కోట్లు ప్రజలపై విద్యుత్‌ భారాలు వేసి వసూలు చేసిందని చెప్పారు. విద్యుత్‌ సంస్కరణలు బిల్లు 2022 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫ్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు ఆపాలని కోరారు. 18 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తున్న విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే 2024 ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం శంకర మాన్యాలు ప్రజలు పట్టిస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జయరాం, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, జాన్‌ ప్రసాద్‌, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంచలయ్య, నందకుమార్‌, పెనగలూరు మండలం సిపిఎం కార్యదర్శి ప్రసాద్‌ పాల్గొన్నారు.
మదనపల్లె అర్బన్‌: విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యం కావాలని సిపిఎం పట్టణ కార్యదర్శి డి.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపుదలను, ప్రజా ఉద్యమాల నిర్బంధనలపై నిరసిస్తూ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపటం దారుణమన్నారు. అప్పుల కోసం వైసిపి ప్రభుత్వం కేంద్ర విద్యుత్‌ సంస్కరణలకు దాసోహం అవడం శోచనీయమన్నారు. ప్రజలపై విద్యుత్‌ భారం తీవ్రంగా ఉందని తెలిపారు. సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్‌ ఛార్జీలు, సర్‌ఛార్జీలు, అదనపు లోడ్‌ డిపాజిట్లు, అదనపు కస్టమర్‌ ఛార్జీలు వివిధ రూపాల్లో ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, అశోక్‌, రమణ, శ్రీనివాసులు, కృష్ణమూర్తి, చలపతి పాల్గొన్నారు.