కడప అర్బన్ : పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాలు వ్యతిరేకిస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి సిపిఎం జిల్లా కారదర్శి జి.చంద్రశేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డబ్ల్యూ.రాము, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి రమణయ్య, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పి) జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి జయవర్ధన్ మాట్లాడారు. విద్యుత్ బిల్లుల మోతతో ప్రజలకు షాక్ కొట్టిస్తున్న ప్రభుత్వ విధానాలు, ప్రజలు తిప్పికొ ట్టాలని పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 2022 కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లు చట్టం తెచ్చిందని విమర్శించారు. ఫిక్స్‌డ్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, విద్యుత్ సుంకం, ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ఛార్జీల పేరుతో విద్యుత్ వాడుక బిల్లు కన్నా, ప్రభుత్వ అవసరాల ఆదాయ బిల్లులే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్ యూనిట్ ధర భారీగా పెంచారని, అసలు ఛార్జీల కన్నా కొసరు ఛార్జీలు ఎక్కువగా కస్టమర్ సేవల పేరుతో ప్రజలను నిలువు దోపిడీ పాలక ప్రభుత్వాలే చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రజలపై విద్యుత్ భారాలు మోయలేని విధంగా వేసి అమలు చేస్తున్నారన్నారు. మీటర్ నిర్వహణ ఛార్జీలు విధిస్తున్నారని తెలిపారు. సెల్ ఫోన్లకు ఎలా రీఛార్జ్ చేసు కుంటున్నామో, విద్యుత్ బిల్లులను రీఛార్జ్ చేసుకునే పద్ధతి తీసుకొచ్చి అమలు చేయనున్నారని చెప్పారు. ప్రపంచ బ్యాంకు సంస్కరణల షరతులు అమలులో భాగంగానే విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి విద్యుత్ ఉద్యమంలో అమరులైనారని, నేటి 23 ఏళ్లయిందని, ప్రజల ప్రాణాలు పోతే తప్ప పాలకులు కళ్ళు తెరవని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. నేటి మోయలేని విద్యుత్తు భారాలు తగ్గేవరకు బషీర్‌బాగ్ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీలు నూటికి నూరు శాతం పెంచి నిర్బంధంగా వసూలు చేస్తున్నారన్నారు. టు ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజల నుంచి డబ్బు పాలకులు పిండుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2022 విద్యుత్ చట్టం రాకముందే రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం 2021లోనే రూ.3,669 కోట్లు ప్రజలపై విద్యుత్ భారాలు వేసి వసూలు చేసిందని చెప్పారు. విద్యుత్ సంస్కరణలు బిల్లు 2022 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ఆపాలని కోరారు. 18 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే 2024 ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం శంకర మాన్యాలు ప్రజలు పట్టిస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.మనోహర్, ఎ.రామ్మోహన్, ఐ.ఎన్.సుబ్బమ్మ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులరెడ్డి, దస్తగిరిరెడ్డి, వి.అన్వేష్, సత్యనారాయణ, శ్రీనివాసులు, సిపిఎం నగర నాయకులు చంద్రారెడ్డి, ఓబులేసు, సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ, బాదుల్లా, సుధాకర్, హేతువాద సంఘం నాయకులు సిఆర్‌వి ప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డాక్టర్ శ్రీనివాసులు, లోక్‌సత్తా నాయకులు కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తార్ పాల్గొన్నారు.










