Jun 25,2023 00:49

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి -మధురవాడ : పెంచిన విద్యుత్‌ ఛార్జీలు, ట్రూ అప్‌ ఛార్జీలు రద్దుచెయ్యాలని, స్మార్ట్‌ మీటర్లు పెట్టాలన్న ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ శనివారం సిపిఐ ఏరియా కార్యదర్శి వి.సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టిడిపి, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యాన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపి సీనియర్‌ నాయకులు పిళ్ల వెంకటరావు, గొల్లంగి ఆనందబాబు, దాసరి శ్రీనివాస్‌, కానూరి అచ్యుతరావు, సిపిఎం నాయకులు రాజ్‌కుమార్‌, ఎమ్‌డి బేగం, భారతి తదితరులు మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 2020 విద్యుత్‌ సంస్కరణలను బిజెపి పాలిత రాష్ట్రాలు కన్నా జగన్మోహన్‌రెడ్డి ముందుగా అమలుచేస్తున్నారని విమర్శించారు. గడిచిన నాలుగేళ్లలో రూ.50 వేల కోట్ల భారం వేశారని, ఇప్పుడు మరో రూ.17 వేల కోట్లును స్మార్ట్‌ మీటర్లు పేరుతో వడ్డిస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే వేసిన చెత్త సేకరణ పన్ను, ఆస్తి మూలధన విలువ పన్ను, నీటి పన్నులు, పెరిగిన నిత్యవసరాల ధరలతో జీవనం సాగించలేక ప్రజలు అవస్థలు పడుతున్నాన్నారు. ఈ సమయంలో ప్రజల నడ్డి విరిచేలా పెద్ద ఎత్తున విద్యుత్‌ ఛార్జీలు పెంచడం దుర్మార్గం అన్నారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తక్షణమే రద్దు చెయ్యాలని డిమాండ్‌ చేశారు.