రాజంపేట అర్బన్ : విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యం కావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శివరామకృష్ణ అన్నారు. మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో విద్యుత్తు బిల్లులపై ప్రజల వద్దకు వెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపటం దారుణ మన్నారు. అప్పుల కోసం వైసిపి ప్రభుత్వం కేంద్ర విద్యుత్ సంస్కరణలకు దాసోహం అవడం శోచనీయమన్నారు. ప్రజలపై విద్యుత్ భారం తీవ్రంగా ఉందని తెలిపారు. సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, సర్‌ఛార్జీలు, అదనపు లోడ్ డిపాజిట్లు, అదనపు కస్టమర్ ఛార్జీలు వివిధ రూపాల్లో ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. మోడీ, జగన్ కలసి సామాన్యుల నడ్డి విడుస్తున్నారని, చిరువ్యాపారుల నుండి చిన్న పరిశ్రమల వరకూ ప్రతిఒక్కరూ బాధితులేనని తెలిపారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అన్ని పట్టణాల్లో వర్తక, వాణిజ్య సంఘాలు, కాలనీ అసోసియేషన్లు, పౌర సంఘాలతో కలిసి జూన్ 30న ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా మరో విద్యుత్ పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని, అందుకోసం ఈ నెల 30న జిల్లా వ్యాప్తంగా జరుగు ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాయుడు, సికిందర్, వెంకటయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు దినేష్, మహమ్మద్, హరి, ఎఐవైఎఫ్ నాయకులు శరత్, ఎఐటియుసి నాయకులు నాగేశ్వర్, గంగయ్య, చంద్ర తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.










