Jun 23,2023 21:24

కరపత్రాలు పంపిణీ చేస్తున్న సిపిఎం నాయకులు

మదనపల్లె అర్బన్‌ : విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యం కావాలని సిపిఎం పట్టణ కార్యదర్శి డి.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో విద్యుత్‌ పోరుబాట పేరుతో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపటం దారుణమన్నారు. అప్పుల కోసం వైసిపి ప్రభుత్వం కేంద్ర విద్యుత్‌ సంస్కరణలకు దాసోహం అవడం శోచనీయమన్నారు. ప్రజలపై విద్యుత్‌ భారం తీవ్రంగా ఉందని తెలిపారు. సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్‌ ఛార్జీలు, సర్‌ఛార్జీలు, అదనపు లోడ్‌ డిపాజిట్లు, అదనపు కస్టమర్‌ ఛార్జీలు వివిధ రూపాల్లో ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. మోడీ, జగన్‌ కలసి సామాన్యుల నడ్డి విడుస్తున్నారని, చిరువ్యాపారుల నుండి చిన్న పరిశ్రమల వరకూ ప్రతిఒక్కరూ బాధితులేనని తెలిపారు. స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా అన్ని పట్టణాల్లో వర్తక, వాణిజ్య సంఘాలు, కాలనీ అసోసియేషన్లు, పౌర సంఘాలతో కలిసి జూన్‌ 30న ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా మరో విద్యుత్‌ పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని, అందుకోసం ఈ నెల 30న జిల్లా వ్యాప్తంగా జరుగు ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సహదేవ, అంజి, నాగరాజు పాల్గొన్నారు.