పల్నాడు జిల్లా: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన విద్యుత్ ఛార్జిలను తక్షణమే ఉప సంహ రించుకోపోతే 2000 సంవత్సరం తరహాలో మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు డి.శివకుమారి హెచ్చరించారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 27న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టనున్న ధర్నాకు సంబంధించి వామపక్ష పార్టీల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం పట్టణ కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శివ కుమారి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని మాట తప్పను మడమ తిప్పను అంటూ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చాక పలు మార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై వందల కోట్ల భారాలు వేశాడని విమర్శించారు. వినియోగించుకున్న విద్యుత్ ఛార్జీల కంటే ప్రభుత్వం అదనంగా వేసిన సర్దు బాటు చార్జీలు ఎక్కువుగా ఉన్నాయని విమర్శించారు. అదనపు భారాలు, సర్దుబాటు చార్జీలకు వ్యతిరేకంగా ప్రజలు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పిలుపు నిచ్చారు.
అంతేకాకుండా, భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, పట్టణాల్లో చెత్త పన్ను, ఇంటి పన్ను, కుళాయి పన్నులు పెంచి ప్రజలపై భారాలు మోపడమే పనిగా పెట్టు కున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల ప్రక్రియన, వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్ల ప్రక్రియను దేశంల ోని బిజెపి పాలిత రాష్ట్రాలు సైతం వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. కేసుల భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ నిర ్ణయాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. విద్యుత్ ఛార్జీల జోలికి వస్తే గతంలో చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. అనంతరం ఎం సిపిఐయు జిల్లా కార్యదర్శి రెడ్ బాషా, పిడిఎం నాయకులు రామకష్ణ, సిపిఐ ఏరియా నాయకులు ఉప్పలపాటి రంగయ్య లు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వ నిరంకుశ విధానాలను వీడకపోతే రాబోయే రోజుల్లో ప్రజలను సమీకరించి మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని వామపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన విధానాన్ని మార్చుకొని విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై వేస్తున్న అదనపు భారాన్ని తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు ఆంజనేయరాజు, సుభాని పాల్గొన్నారు.










