ప్రజాశక్తి-గుత్తి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించడంతోపాటు వ్యవసాయ మోటార్లకు మీటర్లను ఏర్పాటు చేయరాదని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం గుత్తిలో ధర్నా నిర్వహించారు. ముందుగా సిపిఎం, సిపిఎం నాయకులు, కార్యకర్తలు గుత్తి ఆర్‌ఎస్‌లోని పూలే విగ్రహం నుంచి ప్రదర్శనగా ఏపీ ఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయానికి చేరుకుని అక్కడ బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బి.రామకృష్ణ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రయ్య, మండల కార్యదర్శి జి.రామదాసు మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ రకాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచడం బాధాకరమన్నారు. ఫలితంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అలాగే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతులపై పెనుభారం పడుతుందన్నారు. అనంతరం ఏపీఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు వి.నిర్మల, ఐద్వా మండల కార్యదర్శి ఎన్.రేణుక, కవిత, కెవిపిఎస్ మండల కార్యదర్శి యు.మల్లికార్జున, సిపిఐ నాయకులు మధుసూదన్‌రావు, రమేష్, రాజు, మహబూబ్బీ, షఫీ, నరసింహయ్య, పూల మాబు, ఏఐటీయూసీ నాయకులు నజీర్, రజాక్, సూరి, తదితరులు పాల్గొన్నారు.
గుంతకల్లు : ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారంతోపాటు స్మార్ట్ మీటర్లు ఏర్పాటును నిరసిస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ డిఎఇ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు జగ్గలి రమేష్, గోపీనాథ్, సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని మోడీకి మోకరిల్లి అదానీకి అనుకూలంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నెత్తిన భారాలు మోపిందన్నారు. ఇది చాలదు అన్నట్లుగా స్మార్ట్ మీటర్లు బిగించేందుకు కుట్రలు చేస్తోందన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను బిగించరాదని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, కమిటీ సభ్యులు కసాపురం రమేష్, రామునాయక్, షాషావలిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అనుబంధ ఏపి రైతు సంఘం మండల కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, సిపిఎం పట్టణ కమిటీ నాయకులు కసాపురం రమేష్, సిపిఐ నాయకులు మహేష్, గోపీనాథ్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు చిన్న తదితరులు పాల్గొన్నారు.
గుత్తిలో విద్యుత్ శాఖ ఎఇ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న సిపిఎం, సిపిఐ నాయకులు










