Oct 13,2023 22:49

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా): తమది పేదల ప్రభుత్వం, పెత్తందారులపై తమ పోరాటం అని చెబుతూ ప్రజలపై భారాలు వేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు వామపక్ష నాయకులు స్పష్టం చేశారు.విద్యుత్‌ సంస్క రణల పేరుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న విద్యుత్‌ చార్జీలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ , సిపిఎం, సిపిఐ,సీపీఐ ( ఎం ఎల్‌ ) మచిలీపట్నం కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కోనేరు సెంటర్‌లో ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రకరకాల పేరుతో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజల పై వేస్తున్న విద్యుత్‌ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో 25 వేల కోట్ల రూపాయలు కరెంటు చార్జీలు పేరుతో ప్రజలపై భారం మోపిందని, సర్‌చార్జి ల పేరుతో ప్రజలపై వేసే భారాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రజా బ్యాలెట్‌ లో మొత్తం 635 మంది తమ అభిప్రాయాలను ఓటు ద్వారా ప్రజా బ్యాలెట్‌ లో వేశారు .వీరిలో 626 మంది విద్యుత్‌ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా, 6 అనుకూలంగా,3 తటస్థంగా వేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మచిలీపట్నం నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్‌ రాజేష్‌, సీనియర్‌ నాయకులు కొడాలి శర్మ, కమిటీ సభ్యులు సిహెచ్‌ జయరావు, ఎండి యూనస్‌, టి చంద్రపాల్‌, ఎల్‌ఐసి యూనియన్‌ నాయకులు జి. కిషోర్‌ కుమార్‌, వి. ఠాగూర్‌, చంద్రశేఖర్‌, ఐద్వా పట్టణ కార్యదర్శి కే. సుజాత,బి. భవాని, సిహెచ్‌. అరుణ కుమారి, కెవిపిఎస్‌ పట్టణ అధ్యక్షులు ఎం.ఏ. బెనర్జీ, డి సత్యనారాయణ ,రైతు సంఘంనాయకులు ఈడే. రామారావు, సీపీఐ నాయకులు లింగం ఫిలిప,్‌ ఓ.ఎల్‌ రావు, ఆర్టీసీ ,హమాలీ వర్కర్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.