ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ
మ్యాక్సీ క్యాబ్‌కు పెంచిన రోడ్డు ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, ఇన్యూరెన్స్, ఈ చలానా రద్దు చేయాలని కోరుతూ బుధవారం విశాఖ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన మద్దిలపాలెంలోని ఎయు ఇంజినీరింగ్ కాలేజీ నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ ప్రారంభించారు. అనంతరం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. డిఆర్‌ఓ శ్రీనివాసమూర్తికి వినతిపత్రం సమర్పించారు. మోటారు ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.అప్పలరాజు అధ్యక్షతన సాగిన ధర్నాలో యూనియన్ గౌరవాధ్యక్షులు బి.జగన్ మట్లాడుతూ, రవాణా రంగం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.3 లక్షల కోట్లను వివిధ పన్నుల రూపంలో కడుతున్నారన్నారు. ఈ పన్నుల్లో కనీసం 5 శాతం ఖర్చు పెడితే డ్రైవర్లలందరీకీ పిఎఫ్, ఇఎస్‌ఐతో కూడిన వెల్ఫేర్‌బోర్డు ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. ప్రభుత్వాలు ఆదాయాన్ని పెంచుకోవడానికి రవాణా రంగంపై ఫెనాలిటీలు, పన్నులు, ఈ చలానాలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి తమ మీద వేస్తున్న పన్నులు రద్దు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి డ్రైవర్లు అందరూ బటన్ నొక్కుతారని స్పష్టంచేశారు.
ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగాలు లేక రూ.లక్షలు ఫైనాన్స్ తీసుకొని, టాటా మ్యాజిక్‌లు కొనుక్కొని స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. దానికి తోడు టాటా మ్యాజిక్‌లకు విపరీతమైన రోడ్డు, గ్రీన్ ట్యాక్స్‌లు, ఇన్స్యూరెన్స్‌లు ప్రీమియం పెంచారని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా సమయంలో పొటోలు తీసి ప్రతి బండికి ఈ చలానా పేరుతో రూ. 20 వేలు తప్పుడు చలానాలు కట్టమని వేధిస్తున్నారన్నారు. రోడ్డుపై బండిని తిరగనీయకుండా అపేస్తున్నారని తెలిపారు.
రోడ్డు ట్యాక్స్ రూ.6040
రోడ్డు ట్యాక్స్ రూ.4,570 ఉంటే ఇప్పుడు రూ.6040 పెంచారన్నారు. గతంలో గ్రీన్ టాక్స్ రూ.2 వేలు ఉంటే, ఒక్కసారిగా రూ.6 వేలకు పెంచారన్నారు. లేబర్ టాక్స్ రూ.1500 వేస్తున్నారని తెలిపారు. గతంలో ఉన్న ఇన్స్యూరెన్స్ రూ. 12 వందలు నుంచి రూ.30 వేల వరకు పెంచడం దుర్మార్గం అన్నారు. కోవిడ్ టైంలో వేసిన ఈ చలానాలు రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ ర్యాలీ, ధర్నాలో ఆటో యూనియన్ అధ్యక్షులు పి.రాజ్‌కుమార్, వివిధ స్టాండ్ నాయకులు సురేష్, సత్యనారాయణ రెడ్డి, రాంబాబు, శ్రీనివాస్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.










