ప్రజాశక్తి - విశాఖపట్నం : ప్రజలు భరించలేని భారమైన పెంచిన ఆస్తి, చెత్త, నీటి పన్నులు రద్దు చెయ్యాలని గురువారం జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం చెయ్యాలని వామపక్ష పార్టీలు గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి జీవీఎంసీ ప్రధాని కార్యాలయం వరకు శాంతియుతంగా నిరసన ప్రదర్శనకు ద్వారా డిమాండ్ చేస్తే మార్గ మధ్యలో అక్రమంగా అరెస్టులు చెయ్యడం దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం
పైడిరాజు, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యురాలు బొట్టా ఈశ్వరమ్మ, సిపిఐ ఎం ఎల్ జిల్లా నాయకులు రవి, ఎస్‌యుసి ఐ జిల్లా కార్యదర్శి ఎస్ గోవిందరాజులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ పెంచిన అస్తి, చెత్త, నీటి పన్నులు రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. కేవలం వైసీపీ పార్టీ కార్యాలయానికి ఋషికొండలో రెండు ఎకరాలు స్థలం కేటాయించడానికే సమావేశం ఏర్పాటు చేసినట్లు ఉన్నదని ఇతర ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని విమర్శించారు. వెంటనే పెంచిన పన్నులు రద్దు చేసి పాత పద్దతిలోనే పన్నులు వసూలు చెయ్యాలని డిమాండ్ చేశారు. వామపక్ష నాయకులు వి.కష్ణారావు, కె సత్యనారాయణ, ఎం. సుబ్బారావు పి గోవింద్, ఎం. రాంబాబు, రమణి తదితరులతో పాటు 25 మంది వామపక్ష నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.











