ప్రజాశక్తి- అనకాపల్లి
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని కోరుతూ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ జంక్షన్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొణతాల హరినాథ్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి సామాన్య ప్రజల సంక్షేమం పట్టలేదన్నారు. గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు అదుపులో ఉన్నప్పుడే నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉంటాయని తెలిపారు. కార్పొరేట్లకు మేలు చేస్తూ బీద సామాన్య ప్రజలపై కేంద్రం భారాలు మోపడం దారుణమన్నారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టడం ప్రైవేటీకరణ చేయడంతో దేశంలో ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయని, వ్యవసాయ రంగాన్ని కేంద్రం కుదేలు చేసిందని విమర్శించారు. సామాన్యులకు నిత్యవసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండేలా కేంద్రం చర్యలు చేపట్టాలని, తక్షణమే పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సిహెచ్ శ్రీనివాసరావు, ఎం జగన్నాథరావు, పి బాబ్జి, ఎన్ అప్పారావు, టి రామచంద్రరావు, పి లక్ష్మణరావు, కే నూకరాజు పాల్గొన్నారు.










