Mar 02,2023 20:52

నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.యేసురత్నం

పెంచిన గ్యాస్‌ ధర తగ్గించాలి : సిపిఎం
ప్రజాశక్తి - ఆత్మకూర్‌

      కేంద్ర బిజెపి ప్రభుత్వం గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్‌ ధర రు.50, వాణిజ్య సిలెండర్‌ రూ.350 పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్‌టిసి బస్టాండ్‌ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. ఏసురత్నం, పట్టణ కార్యదర్శి ఏ.రణధీర్‌, మండల కార్యదర్శి నరసింహ నాయక్‌లు మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఆకాశాన్నంటా యాన్నారు. రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు పెంచడం దారుణం అన్నారు. 3 సంవత్సరాల క్రితం వరకు రు.417 ఉన్న డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలెండర్‌ ధర నేడు రు.1155కు పెరిగిందన్నారు. ప్రభుత్వం సబ్సిడీ జమను రెండు సంవత్సరాల నుండి నిలిపివేసిందన్నారు. ఇప్పటికే గృహ వినియోగానికి సబ్సిడీ క్రింద ఇచ్చే సిలెండర్ల సంఖ్య కుదించారు. ఆర్ధిక మాంద్యం వలన చితికిపోతున్న స్వయం ఉపాధి మరింత దుర్భరస్థితికి చేరుకుంటుం దని అన్నారు. ఉపాధి లేక, వేతనాలు చాలక ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మూలిగే నక్కపై తాటి పండులా భారాలు మోపడం గర్హనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు డి స్వామన్న, టి.వెంకటేశ్వరరావు డి. రామ్‌ నాయక్‌, ఏ. సురేంద్ర, మాబాష, శివమ్మ, సుధాకర్‌, దినేష్‌,నాయకులు గణపతి, ప్రేమ్‌, శివుడు, మల్లయ్య, నవీను,ధనుంజయ,నబిషా,, శివ, తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం : గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, ధరలు తగ్గించాలని ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు. వై ఆశీర్వాదం డిమాండ్‌ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ స్థానిక భగత్‌ సింగ్‌ గ్రంథాలయంలో ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం మాట్లాడారు. ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర సరుకులను గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ పన్నుల భారాన్ని పెంచి ప్రజల నడ్డి విధిస్తున్నారన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలు తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు మండల అధ్యక్షుడు వై శీను, పి మల్లికార్జున, ఆటోమొబైల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కార్యదర్శిఏ బెనహర్‌, ఎస్‌ కే వలి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. పాములపాడు : పెంచిన గ్యాస్‌ ధరను వెంటనే తగ్గించాలని సిపిఎం మండల కార్యదర్శి సామన్న, నాయకులు వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. నిత్యవసర వస్తువులు పెరగడంతో జీవనం సాగించేందుకు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.