Mar 03,2023 21:23

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ కుమార్‌

పెంచిన గ్యాస్‌ ధర తగ్గించాలి
- సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌
- సిపిఎం ఆధ్వర్యంలో గ్యాస్‌ సిలీండర్లతో ధర్నా
ప్రజాశక్తి - నంద్యాల

       పెంచిన వంట గ్యాస్‌ ధరను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని బాబు జగజీవన్‌ రావు సర్కిల్‌లో వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో వినూత్నంగా గ్యాస్‌ సిలిండర్లు పెట్టుకొని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు డి.లక్ష్మణ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలను నాశనం చేయడానికి అధికారంలోకి వచ్చిందని, అందుకే భారాల మీద భారాలు వేస్తూ, ఆదాని, అంబానీలకు దోచిపెడుతుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వంట గ్యాస్‌ ధర రూ.414 ఉండేది, ఇప్పుడు రూ.1200లకు చేరిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీ ఎత్తున పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందన్నారు. గతంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి దోచుకుపోతే ఇప్పుడు మోడీ ప్రభుత్వం హయాంలో నార్త్‌ ఇండియా కంపెనీ వారు ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం వండుకొని తినాలంటే పేదలు 1200 రూపాయలు పెట్టి గ్యాస్‌ సిలిండర్‌ కొనుక్కోవాల్సిన దుస్థితి ఈ దేశంలో ఉందన్నారు. రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వాన్ని కచ్చితంగా ప్రజలు గద్దె దింపుతారన్నారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెట్రో ఉత్పత్తుల ధరలను స్థిరంగా ఉంచి, ఆ తర్వాత భారీగా పెంచడం గతంలో చూసామని, వరుసగా వివిధ రాష్ట్రాల ఎన్నికల పుణ్యమా కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒకేసారి పెంచడం బాధాకరమన్నారు. తక్షణమే గ్యాస్‌ ధర, అన్ని రకాల ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు, సీనియర్‌ నాయకులు తోట మద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట లింగం, నాయకులు ఓ.లక్ష్మణ్‌, శివ, మరియమ్మ , తిరుపాలమ్మ, వెంకటేశ్వర్లు, మధు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.