పెంచిన భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలి
- పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పుల్లారెడ్డి
ప్రజాశక్తి - ఆత్మకూర్
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పుల్లారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని డాక్టర్‌ఏ. ధనుంజయ మీటింగ్ హాల్‌లో పట్టణ పౌర సంక్షేమ సంఘం పట్టణ సమావేశం కార్యదర్శి ఎ.సురేంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల విలువ పెరిగితే ఇంటి పన్నులు పెరుగుతాయని అన్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ విలువను రద్దు చేయాలని కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలపై భారాలను వేయడమే పనిగా పెట్టుకుందని అన్నారు. ఇసుక ధరను పెంచిందని, చెత్త పన్నును తీసుకువచ్చిందని, ఇంటి పన్ను, కొళాయి పన్నులు పెంచిందని, చలానాల పేరుతో వాహనాదారుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తుందని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుండి సర్దుబాటు పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచుతుందని, మళ్లీ ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరగొడుతుందని, ఇలాంటి ప్రభుత్వం గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేదని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను దూరం చేస్తుందని చెప్పారు. ఒక గజానికి గతంలో రిజిస్ట్రేషన్ చార్జీలు 1500 రూపాయలు ఉంటే ఇప్పుడు 3500 కు పెంచిందని, మరి కొన్నిచోట్ల 4,500కు పెంచిందని, జిల్లాలో ప్రజలపై అదనంగా 50 కోట్లు భారం వేసిందని తెలిపారు. ఇంత భారంగా ఉన్నప్పుడు ప్రజలు ఏరకంగా ఇంటి స్థలాన్ని కొనగలుగుతారని ప్రశ్నించారు. నవరత్నాల అమలు కోసం ప్రజలపై భారాలు వేసి ముక్కుపిండి వసూలు చేయడం దుర్మార్గమన్నారు. సంక్షేమ పథకాల కోసం నిధులు కావాలంటే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలని, కార్పొరేట్ కంపెనీలపై అధిక పన్నులు వసూలు చేయాలని తెలిపారు. వైసిపి ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు సుబ్బయ్య, రామకృష్ణుడు, డివైఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షులు ఎ.రణధీర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు స్వాములు, రైతు సంఘం మండల కార్యదర్శి వీరన్న, నాయకులు అంబయ్య, గణపతి, మోహన్, రైట్ బాషా తదితరులు పాల్గొన్నారు.










