ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖ బ్యూరో
'అస్తి విలువ ఆధారంగా భారీగా పెంచిన అస్తి పన్నును, చెత్తపై విధించిన యూజర్ చార్జీలను సవాల్ చేస్తూ తాను హైకోర్టులో వేసిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ పిల్ (30239/2022) విచారణలో ఉంది. అందువల్ల 198 జిఒ ప్రకారం చట్ట విరుద్ధంగా అస్తి విలువ ఆధారంగా పెంచిన అస్తి పన్నును, చెత్త పై విధించిన యూజర్ చార్జీలను నిలిపివేస్తూ ఈ నెల 10న జరిగే జివిఎంసి కౌన్సిల్ లో ఎజెండా పెట్టి తీర్మానం చేయాలి' అని మేయర్ గొలగాని హరి వెంకటకుమారికి 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు ప్రతి పాదిత అజెండాను అందించారు. భవనాల ప్లాన్ల పేర అక్రమంగా వసూలుచేస్తున్న పెనాల్టీలను కూడా నిలిపి వేయాలని కోరారు. చెత్తపై విధించిన యూజర్ ఛార్జీలపై కౌన్సిల్‌లో అజెండా పెడతామని తెలిపారు.
మూడు దశాబ్దాల నుంచి తీవ్ర సమస్యగా కొనసాగుతున్న పంచ గ్రామాల భూసమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కౌన్సిల్‌లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని మేయర్‌ను కోరారు. ఈ సమస్య వల్ల జివిఎంసి పరిధి లోని 93, 94, 95, 97, 98 వార్డుల్లోని అడవివరం, అర్‌అర్ వెంకటాపురం, వేపగుంట, పురుషోత్తపురం, చీమలాపల్లి గ్రామాల్లో లక్ష మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. 275 సర్వే నెంబర్‌లో చినగదిలి, గోపాలపట్నం, సింగాలమ్మపురం, సత్యసాయి నగర్, సింహాద్రిపురం, వెంకోజి పాలెం తదితర ప్రాంతాల్లో 30వేల మంది పేదలు నివాసముంటున్నారని, ఈ ప్రాంతాలన్నింట్లో సింహాచలం దేవస్థానం నిర్మాణాలు, రిపేర్లు చేసుకోనీయడం లేదని వివరించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లో ఈ సమస్య పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, మూడేళ్లు దాటినా పరిష్కారం కాలేదని తెలిపారు. తక్షం భూ క్రయ విక్రయాల కు, రిజిస్ట్రేషన్‌లకు, నిర్మాణాలకు, రిపేర్లు అనుమతులుకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 10న జరిగే కౌన్సిల్‌లో అజెండా పెట్టి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు.










