Aug 29,2023 22:33

మోడీ అధికారంలోకొచ్చాక సిలిండర్‌ ధర రూ.700కుపైగా పెంపు
ప్రస్తుతం వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1136
గ్యాస్‌ నగదు బదిలీకి తిలోదకాలిచ్చిన బిజెపి సర్కార్‌
సిలిండర్‌పై రూ.200 తగ్గింపుపై అక్కా చెల్లెమ్మల పెదవివిరుపు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.200 తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే మోడీ సర్కార్‌ అధికారంలోకొచ్చాక వంటగ్యాస్‌ సిలిండర్‌ పెరిగిన ధరకు, ప్రస్తుతం తగ్గించిన ధరకు అసలు పొంతన లేకుండాపోయింది. దీంతో పెంచింది కొండంత, తగ్గించింది గోరంత అంటూ జనం పెదవి విరుస్తున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎనిమిది లక్షల వరకూ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. హెచ్‌పి, ఇండియన్‌, భారత్‌ వంటి గ్యాస్‌ సిలిండర్లను వినియోగదారులు వినియోగిస్తున్నారు. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేససరికి వంటగ్యాస్‌ 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.410 మాత్రమే. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.1136గా ఉంది. అంటే రూ.700కుపైగా సిలిండర్‌ ధర పెరిగింది. 2014కు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం వంటగ్యాస్‌ సిలిండర్‌పై నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది. సబ్సిడీ సొమ్ము వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో వేసేవిధంగా నిబంధనలు తెచ్చింది. మోడీ ప్రభుత్వం వచ్చాక నెలల వారీగా గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరుగుతూ ప్రస్తుతం రూ.1136కు చేరింది. వంటగ్యాస్‌పై నగదు బదిలీ పథకాన్ని మోడీ సర్కార్‌ నిలిపివేసింది. దీంతో పూర్తిసొమ్ము చెల్లించి వినియోగదారులు సిలిండర్‌ కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లాలో అత్యధిక గ్యాస్‌ వినియోగదారులు సామాన్య ప్రజానీకమే. ప్రతినెలా గ్యాస్‌ సిలిండర్‌ కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో రక్షాబంధన్‌ కానుకగా సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం వినియోగదారులకు ఏదో మేలు చేసినట్లు గొప్పలు చెబుతోంది. పెరిగిన ధరతో పోలిస్తే తగ్గిన ధర అతి స్వల్పమని జనం కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.