Aug 15,2021 06:08

    బిజెపి ప్రభుత్వం చేతికి తాజాగా పెగాసస్‌ అనే సైబర్‌ ఆయుధం వచ్చి చేరింది. తన నిరంకుశ చర్యలకు దీన్ని యథేచ్ఛగా వినియోగిస్తోంది. వెయ్యి మందికి పైగా మేధావులు, అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం లోని వ్యక్తిగత సిబ్బంది, సిబిఐ డైరెక్టర్‌, ఎన్నికల సంఘం కమిషనర్‌, జర్నలిస్టుల ఫోన్లు ఈ స్పైవేర్‌ దాడికి గురయ్యాయని తేలింది. పోతే, ప్రపంచవ్యాప్తంగా పాలవర్గాలు ఈ నిఘా సాధనాన్ని నిరాఘాటంగా వినియోగిస్తున్నాయని వెల్లడవుతోంది.
 

                                                            లాభాల కోసమే పెగాసస్‌

     ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ (నివ్‌, షలేవ్‌, ఒమ్రీ) సంస్థ వ్యవస్థాపకులతో పాటు కార్మి, హోలియో లు 2010లో ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేశారు. ఇది ప్రపంచంలో అత్యధిక నాణ్యతా ప్రమాణాలు కలిగిన యాపిల్‌ వంటి మొబైళ్లు, లాప్‌టాప్‌ లలోకి సులభంగా ప్రవేసించి ఆ పరికరాలను హ్యాక్‌ చెయ్యగలదు. అందులో వున్న ఫోటోలు, వీడియోలు, కాల్‌ రికార్డ్స్‌, వాట్సాప్‌ లో ఉన్న సమాచారాన్ని అత్యంత వేగంగా సేకరిస్తుంది. అంతేకాకుండా మన ప్రమేయం లేకుండా మన ద్వారా మెయిళ్లు, ఎస్‌ఎమ్‌ఎస్‌ లు వేరొకరికి చొప్పించే విధంగా చేయగలదు. పెగాసస్‌ ను ఉగ్రవాదులు, నేరస్తుల ఆచూకీ తెలుసుకోవడం కోసం తయారు చేశామని ఎన్‌ఎస్‌ఒ చెప్తున్నది. కానీ దేశ ఆదర్శాలకు ద్రోహం చేసే నియంతలకు గూఢచారి సాఫ్ట్‌వేర్‌ను విక్రయిస్తోంది. ఇప్పటికి 50 దేశాల్లో సుమారు 50,000 పైగా పరికరాల్లోకి అతి తక్కువ కాలంలోనే చొరబడింది. ఇందులో 600 మంది రాజకీయ నాయకులు, 189 మంది ప్రముఖ జర్నలిస్టులు ఉన్నారు. ఆ విధంగా ఎక్కువ ఎలక్ట్రానిక్‌ పరికరాలను లక్ష్యంగా చేసుకుని లాభాలు సంపాదించడమే దీని లక్ష్యం.
 

                                                  ప్రశ్నించే గొంతులను నొక్కేందుకే

    పాలక వర్గాలు ఈ స్పైవేర్‌ను ఉపయోగించి ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నాయి. సౌదీ అరేబియాలో ప్రముఖ జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ ప్రగతిశీల ఆలోచనలు చేసేవారు. ఇది సహించని సౌదీ ప్రభుత్వం ఆయన మీద పెగాసెస్‌ ద్వారా నిఘా పెట్టి తన ఏజెంట్లతో 2018లో దారుణంగా హతమార్చింది. ఆరు దేశాల్లో ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను అణచివేయడానికి ఈ ఆయుధాన్ని ఉపయోగించాయి. ఆ కోవ లోకి భారత దేశం చేరుతోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ ను నేరుగా ప్రభుత్వాలకు తప్ప ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయించడంలేదని 2018 లో ఎన్‌ఎస్‌ఒ బహిరంగ ప్రకటన చేసింది. దీన్నిబట్టి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ద్వారానే ఈ పెగాసెస్‌ భారతదేశం లోకి ప్రవేశించిందనడంలో సందేహం లేదు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం, ప్రశ్నించే గొంతులను అణిచివెయ్యడం కోసం దీన్ని ఉపయోగించుకుంటోంది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం 2019లో జరిగిన పుల్వామా దాడులకు కారకులైన వారిపై నిఘా పెట్టలేదు. కానీ కాశ్మీర్‌లో ప్రముఖ పౌర సామాజిక కార్యకర్తతో పాటు మరో 25 మందిపై నిఘా ఏర్పాటు చేసి ఆర్టికల్‌ 370 రద్దు చేయడానికి ఒక రకంగా మార్గం సుగుమం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నోట్ల రద్దు, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, జిఎస్‌టి అన్నీ విఫలం చెందాయి. ఈ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రతిపక్ష నాయకుల పైన, మీడియా వారి పైనా, ఎన్నికల సంఘం కమిషనర్‌ పైనా నిఘా ఏర్పాటు చేసింది. 2019లో మళ్లీ అధికారంలోకి రావడానికి మోడీ ప్రభుత్వం ఈ పెగాసస్‌ ను ఒక ఆయుధంగా ఉపయోగించుకుంది. టొరెంటో విశ్వవిద్యాలయానికి చెందిన సిటిజన్‌ ల్యాబ్‌ నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఇద్దరు మంత్రులు, 40 మంది ప్రముఖ జర్నలిస్టులు, ముగ్గురు ప్రతిపక్ష నాయకులతో పాటు మొత్తంగా 300 మంది మొబైళ్లపై పెగాసస్‌ నిఘా వుంది.
 

                                                     చట్ట విరుద్ధంగా సమాచార వినియోగం

    పెగాసస్‌ ఒక పరికరంలోని సమాచారాన్ని సేకరించడంతో పాటు మన ప్రమేయం లేకుండా సమాచారాన్ని చొప్పిస్తుంది. ఇది ప్రజల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడం అవుతుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ ఒక టూల్‌కిట్‌ విడుదల చేశారు. కానీ పోలీసు విచారణకు వచ్చినప్పుడు తన ప్రమేయం లేకుండానే అందులోని సమాచారం మొత్తం డిలిట్‌ చేయబడింది. అదే కేసులో నిందితురాలిగా ఉన్న దిశా రవి కి గ్రెటా థన్‌బర్గ్‌ కు మధ్య ఎటువంటి కమ్యూనికేషన్‌ లేకుండానే వారిద్దరి మధ్య మెయిళ్ల ద్వారా ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా కమ్యూనికేషన్‌ ఉన్నట్టు తన ప్రమేయం లేకుండానే చేర్చబడింది. ఇటువంటి చర్యలు భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయి. ఒక రకంగా ఇది తప్పు చేయని వారు జైళ్లలో మగ్గేలా చేస్తుంది. సుమారు 10 దేశాల్లో ఉన్న ఈ నిఘా సంస్థలు ఇతర దేశాలపై నిఘా ఉంచి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. సిటిజన్‌ ల్యాబ్‌ నివేదిక ప్రకారం గల్ఫ్‌ దేశాల్లో పెగాసెస్‌ ఆధారిత కేంద్రాలు కెనడా, అమెరికా, ఫ్రాన్స్‌, గ్రీస్‌ దేశాలపై నిఘా పెట్టి సమాచారాన్ని పోగుచేస్తున్నాయి. ఇదే విధంగా భారత్‌లోకి చొరబడితే దేశంలో ఇప్పటి వరకు గోప్యంగా ఉన్న సైనిక, ఆర్థిక రంగాలకు చెందిన కీలక లావాదేవీలు బట్టబయలవుతాయి. దేశ సార్వభౌమత్వాన్ని, దేశ భద్రతను విదేశీయుల చేతుల్లో తాకట్టు బెట్టడమే అవుతుంది. ఎన్‌ఎస్‌ఒ చెబుతున్న ప్రకారం ఈ పెగాసస్‌ నిఘాను 10 స్మార్ట్‌ఫోన్‌ పరికరాల్లోకి ప్రవేశించడానికి గాను రూ.163 కోట్లు ఖర్చు అవుతుంది. ఆపైన మరో రూ.15 కోట్లు ఖర్చు చేస్తే 15 పరికరాల్లోకి, రూ. 56 కోట్లు ఖర్చు చేస్తే 25 పరికరాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా మన దేశంలో 300 పరికరాలకు గాను సుమారు కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బిజెపి ప్రభుత్వం దుర్వినియోగ పరుస్తోంది. ఈ భారం ప్రజలపైనే పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ప్రజలకు తెలియకుండా మభ్యపెడుతోంది. అందుకే పార్లమెంటు సమావేశాల్లో 'పెగాసస్‌ గురించి చర్చించండి' అన్న ప్రతీ సందర్భంలో...కేంద్ర ప్రభుత్వం తమ బిల్లులను ఆమోదింపజేసుకుంటుంది కానీ దీనిపై చర్చించడం లేదు. భావప్రకటనా స్వేచ్ఛా హక్కులతో పాటు ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించడానికి సుప్రీంకోర్టు ఈ విషయమై కలుగుజేసుకొని న్యాయ విచారణ జరపాలి. ప్రజాస్వామిక వాదులందరూ అప్రమత్తం కావాలి.
 

- డి. రాము,
ఎస్‌ఎఫ్‌ఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి,
సెల్‌ : 9705545164