Jul 23,2021 20:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పెగాసస్‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వమే దోషని, లేనిపక్షంలో పార్లమెంటులో వాయిదా తీర్మానంపై చర్చ జరిపి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు అన్నారు. పెగాసస్‌ వ్యవహారం, ప్రభుత్వ గూఢచర్యం అనే అంశంపై శుక్రవారం ఆన్‌లైన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో డేటా అనేది ఇప్పుడు ప్రధాన వనరుగా ఉందని, సంపద మొత్తం వారి చేతుల్లోకి వెళుతోందని తెలిపారు. ఫోన్లోలోకి సాఫ్ట్‌వేర్‌ను ఎక్కించి దానిద్వారా ఎదుటివారి కదలికలపై నిఘా పెట్టడం, పదవులను సుస్ధిరం చేసుకోవడం కోసం దీన్ని వినియోగించుకోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు చెబుతోంది అబద్ధం అయితే పార్లమెంటులో చర్చించి వాస్తవాలు ఏమిటో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్నారు. దీనిపై వాయిదా తీర్మానం ఇస్తే ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. ఇదే తరహా విమర్శలు యూరప్‌, అమెరికా లాంటి దేశాల్లో వస్తే ప్రభుత్వాలు రాజీనామా చేసి వెళ్లిపోయేవన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం ఈ సాఫ్ట్‌వేర్‌ తెచ్చామని చెబుతున్నారని, నిజంగా అదే అయితే ఉగ్రవాదం తగ్గాలనికానీ అంతకంతకూ పెరుగుతోందని అన్నారు. ప్రజల సంక్షేమానికి చెల్లించేందుకు డబ్బులు లేవని చెబుతూనే కోట్లు వెచ్చించి నిఘా సాఫ్ట్‌వేర్లు కొంటున్నారని తెలిపారు. పైగా దేశ పోలీసు వ్యవస్థను తీసుకెళ్లి ఇజ్రాయిల్‌ చేతుల్లో పెట్టడం అంటే దేశ భద్రతను గాలికొదిలేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాథమిక హక్కును కాపాడటం అనేది ప్రభుత్వాల విధి అని, లాగేసుకోవడం అంటే వాటిని ఉల్లంఘించడమేనని తెలిపారు. రానురాను ఇంటర్నెట్‌ దేశంపై ఆధిపత్యం చూపిస్తోందని తెలిపారు. పెగాసస్‌పై చెలరేగిన వివాదం ముగియాలంటే కేంద్రం ముందుకొచ్చి వివరణ ఇవ్వాలని తెలిపారు. ఉపా లాంటి చట్టాలను రద్దు చేయాలని పేర్కొన్నారు. ఇటీవల నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే వారి ఫోన్లు ట్యాప్‌ చేసి ఎక్కడున్నారో తెలుసుకుని అరెస్టులు చేశారని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉన్నతాధికారులు దాన్ని కొనుగోలు చేసి ఉపయోగించారనే సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. యువత, ప్రజల శక్తియుక్తులను అణచివేసేందుకు స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ విషయాల్లో ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని, డేటా ప్రొటెక్షన్‌ తీసుకురావాలని, నిరంకుశ పద్ధతులకు చెక్‌పెట్టాలని అన్నారు. ఇప్పటికే వాట్సాప్‌, ఆండ్రాయిడ్‌, యాపిల్‌ సంస్థలు కూడా తమ సాఫ్ట్‌వేర్లో పెగాసస్‌ నిరోధాలను పెడుతున్నామని ప్రకటించాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెగాసస్‌ ప్రయోగించారని చెబుతున్న వారి ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబుల్లో పరీక్షించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు.