Jul 22,2021 21:01
  • సుప్రీం పర్యవేక్షణలో సిట్‌ ఏర్పాటు చేయాలని పిల్‌
  • ప్రాజెక్టు డేటాతో ఏకీభవిస్తున్నామన్న అమ్నెస్టీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెగాసస్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రైతు సమస్యలు, పెగాసస్‌ స్పై వేర్‌తో ప్రభుత్వం ప్రతిపక్షాలు, ఉద్యమకారులు, జర్నలిస్టులపై నిఘా విధించిందన్న అంశంపై రాజ్యసభ గురువారం పలుమార్లు వాయిదాపడింది. మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యుల నిరసన మధ్య పెగాసస్‌ వ్యవహారంపై కేంద్ర ఐటి మంత్రి అశ్వినీ వైష్టవ్‌ ప్రకటన చేయడానికి లేవగా టిఎంసి ఎంపి శంతను సేన్‌ మంత్రి చేతుల్లోని పేపర్లను లాక్కొని చించివేశారు. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ సభను వాయిదా వేశారు.

'పెగాసస్‌'పై సుప్రీం పర్యవేక్షణలో సిట్‌
పెగాసస్‌ స్పైవేర్‌తో ప్రభుత్వ సంస్థలు జర్నలిస్టులు, ఉద్యమకారులు, రాజకీయ నేతలు, ఇతరులపై నిఘా పెట్టినట్లు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో గురువారం ఒక పిటిషన్‌ దాఖలైంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బఅందం (సిట్‌) చేత దర్యాప్తు చేయించాలని, పెగాసస్‌ కుంభకోణం చాలా తీవ్రమైనదని న్యాయవాది ఎంఎల్‌ శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థతో పాటు దేశ భద్రతలపై తీవ్రమైన దాడి అని తెలిపారు. వ్యక్తిగత గోప్యత అంటే దాచిపెట్టుకోవాలనే కోరికకు సంబంధించింది కాదని, సొంత ఆలోచనలతో కూడిన భావాలని, అవి వేరొకరి ప్రయోజనాలకు సాధనం కాకుండా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించడం సంభాషణలను చాటుగా వినడం మాత్రమే కాదని, ఒక వ్యక్తి మొత్తం జీవితానికి సంబంధించిన డిజిటల్‌ ఇంప్రింట్‌ను తెలుసుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చునని తెలిపారు. ఫోన్‌ యజమానిని మాత్రమే కాకుండా ఆ వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉండే వారందరి గురించి తెలుసుకోవడానికి దారి తీస్తుందని వివరించారు. త్వరలో కోర్టులో విచారణకు రానున్న ఈ పిటిషన్‌లో నిఘా సాంకేతికత విక్రేతలు పెద్దయెత్తున పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ భద్రత, మానవ హక్కుల సమస్య ఉత్పన్నమవుతుందని, తద్వారా జాతీయ భద్రతకు ఏర్పడే చిక్కులు అపరమైనవని హెచ్చరించారు.

ఇది ఒక సైబర్‌ ఆయుధం..
ఎన్‌ఎస్‌ఒ గ్రూప్‌ కంపెనీ క్లయింట్లు 2016 నుంచి దాదాపు 50 వేల ఫోన్‌ నంబర్లను టార్గెట్‌ చేశారని, ఆ మేరకు నంబర్ల జాబితా మీడియా సంస్థలకు లీక్‌ అయిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పెగాసస్‌ నిఘా సాధనం మాత్రమే కాదని, ఇది సైబర్‌ ఆయుధమని, దీనిని భారత ప్రభుత్వ వ్యవస్థపై ప్రయోగిస్తున్నారని పిటిషన్‌ పేర్కొంది. దీనిని ఉపయోగించేందుకు అధికారం కల్పించినప్పటికీ (ఇది అనుమానం), దేశ భద్రతకు ముప్పు కలుగుతుందనేది స్పష్టమని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని, ఈ స్పైవేర్‌ కొనుగోలు కుంభకోణంలో పాత్ర ఉన్న నిందితులు, మంత్రులను విచారించాలని కోరింది. పెగాసస్‌ స్పైవేర్‌ను కొనడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది.

తప్పుడు మీడియా కథనాలను ఖండించిన అమ్నెస్టీ
పెగాసస్‌ ప్రాజెక్టు డేటాకు పూర్తిగా కట్టుబడి వున్నామని, పెగాసస్‌ స్పైవేర్‌ లక్ష్యాలుగా వున్న వారికి ఈ డేటాకు సంబంధం వుందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొంది. పెగాసస్‌ ప్రాజెక్టులో పేర్కొన్న జర్నలిస్టులు, కార్యకర్తలు, ఇతరులను అక్రమంగా లక్ష్యం చేసుకోవడం నుండి అందరి దృష్టి పక్కకు మళ్లించడానికే ఈ పుకార్లు ఉద్దేశించబడ్డాయని పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక అధికార ప్రకటన జారీ చేసింది. పెగాసస్‌ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు ఆరోపణలను, సరిగ్గా లేని మీడియా కథనాలను ఖండించింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇజ్రాయిల్‌ విభాగం హిబ్రూలో జారీ చేసిన ప్రకటన ఆంగ్ల సారాంశాన్ని త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఈ ప్రకటనకు తప్పుగా భాష్యం చెబుతూ కొన్ని వెబ్‌సైట్లు ఇస్తున్న వార్తా కథనాలను అమ్నెస్టీ ఖండించింది. కాగా, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టారని వచ్చిన ఆరోపణలను కొట్టిపారేయడానికి మోడీ ప్రభుత్వం వాటిని ఉపయోగించుకుంటోంది. దీనిపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇజ్రాయిల్‌ ప్రతినిధి గిల్‌ నవేను వైర్‌ ప్రశ్నించింది. ఇజ్రాయిల్‌ మీడియాలో ఒక వర్గం హిబ్రూ ప్రకటనకు తప్పుగా భాష్యం చెప్పాయని ఆయన అంగీకరించారు. ఇంగ్లీషులో తప్పుగా ప్రస్తావించారని అన్నారు. ఈ ప్రాజెక్టులో అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ కూడా భాగస్వామిగా వుంది. డేటాబేస్‌పై పనిచేసే 67మంది ఫోన్లపై అమ్నెస్టీ టెక్నికల్‌ ల్యాబ్‌ ఫోరెన్సిక్‌ పరీక్ష నిర్వహించింది. వాటిలో 37 ఫోన్లు పెగాసస్‌ హ్యాక్‌కు గురయ్యాయని వెల్లడైంది.