ప్రజాశక్తి - చిలకలూరిపేట : చిలకలూరిపేట పట్టణంలో సుమారు రెండు వారాలకుపైగా తాగునీటి పైపులైన్ల ద్వారా సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ జనాభా సుమారు 1,45,550. మున్సిపాలిటీ పరిధిలో నీటి నిల్వ కోసం రెండు చెరువులున్నాయి. అందులో ఒకటి కొత్త చెరువు కాగా ఇది సుమారు 120 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 2,600 ఎం.ఎల్ (మిలియన్ లీటర్లు). రెండోది పాత చెరువు కాగా ఇది సుమారు 75 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని పూర్తి నీటి సామర్ధ్యం 950 ఎం.ఎల్.గా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రజలకు పాత చెరువు నుండి నీరు సరఫరా అవుతోంది. ఇందులో 32 ఎం.ఎల్. నీరు మాత్రమే ఉంది. రెండో చెరువులో 17.5 ఎం.ఎల్ నీరు ఉండగా ఆ నీటిని మొదటి చెరువుకు ఇంజన్ల ద్వారా తోడారు. ఆ తర్వాత పెద్ద చెరువులో నీరు తగ్గి పోవడంతో తూములకు నీరు అందక ఫిల్టర్ కాకుండానే నేరుగా పైపులైన్‌కు పంపుతున్నారు. దీంతో, ఫిల్టర్ కాకుండా వచ్చే నీరు మురికిగా, పురుగులతో వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. పట్టణంలోని 17 వార్డులకు ఒక రోజు, మిగిలిన 17 వార్డులకు మరో రోజు చొప్పున నీటిని సరఫరా చేయగా ప్రస్తుతం ఆ పరిస్థితీ లేదు. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలు తీసుకోవడానికి జనం మినరల్ వాటర్ ప్లాంట్‌లపై ఆధారపడుతున్నారు.
2017లో కూడా పట్టణంలో తాగునీట ఎద్దడి ఏర్పడింది. నాడు ఓగేరు వాగు నీటిని చెరువులోకి లిఫ్టుల ద్వారా తరలించారు. నేడు ఓగేరు వాగులో కూడా నీరు లేదు. చెరువుకు నీరు నింపాలంటే సాగర్ నుంచి మాత్రమే నీరు నింపాల్సి ఉంది. సాగర్ నుంచి తాగునీటిని విడుదల చేసేందుకు ఇంకా అనుమతులు రాలేదని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన చెరువులను నింపారు. ఆ నీరు సరిపోలేదు. పెరుగుతున్న అవసరాల రీత్యా నాలుగు నెలలకు ఒకసారైనా చెరువులను నింపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏడాదికి రెండుసార్లు నకరికల్లు నుంచి కోటప్పకొండ మీదుగా ఎన్‌ఎస్‌పి కెనాల్స్ ద్వారా రెండు చెరువులకు నీరు వస్తోంది.
పాత లెక్కల ప్రకారం పట్టణ ప్రజలకు రోజుకి 17.5 మిలియన్ లీటర్లు నీరు అవసరమవుతుందని, ప్రస్తుతానికి 20 మిలియన్ లీటర్ల మేరకు అవసరం ఉన్నట్లు సమాచారం. వెంటనే సాగర్ కెనాల్స్ నుంచి నీరు విడుదల చేసినా చెరువుకు నీరు చేరాలంటే వారం పది రోజులు పడుతుంది. గురువారం నీటి విడుదలకు అవకాశం ఉందని, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు చెబుతున్నారు.
ప్రజలపై శ్రద్ధ లేకే ఈ దుస్థితి : సిపిఎం
ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజా అవసరాల పట్ల అప్రమత్తత, శ్రద్ధ లేకపోవమే ప్రస్తుత పరిస్థితికి కారణమని సిపిఎం పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు విమర్శించారు. పట్టణానికి ఎంత నీరు అవసరమో తెలియని స్థిథిలో నాయకులు, అధికారులు ఉన్నారని, ఇప్పటికైనా ప్రత్యామ్నాయ చర్యలు సత్వరమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో ప్రజలు తాగు అవసరాలకు ఆధారపడుతున్న వాటర్ ప్లాంట్లలో ధరలు పెంచకుండా చూడాలన్నారు.










