ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో తనను చంద్రబాబు నాయుడు నర్సరావుపేట నుంచి పోటీ చేయాలంటే చేస్తానని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో డబ్బు లేక ఓడిపోయాయని, ఈసారి తన వద్ద డబ్బులున్నాయని చెప్పారు. డబ్బులేకపోయినా టిడిపికి గాలి వస్తుందన్నారు. తనకు అవకాశం ఇవ్వకపోతే తనకుమారుడు రంగారావుకు సత్తెనపల్లి, పెదకూరపాడులో ఏదో ఒకచోట ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలన్నారు. తన తమ్ముడు కుమార్తె రాయపాటి శైలజకు టిక్కెట్ అడుగుతున్నట్టు తెలిపారు. నర్సరావుపేట అభ్యర్థిగా స్థానికులకు అవకాశం ఇవ్వాలని, రాయలసీమకు చెందిన బిసికి అవకాశం ఇస్తే ఉపయోగం లేదని అన్నారు. ఆ అవకాశం ఏదో స్థానిక బీసీలకు ఇవ్వాలన్నారు. తాను వృద్ధుణ్ణి అయినా అన్నిచోట్లా పర్యటిస్తానని అన్నారు. కన్నాతో తనకు రాజీలేదని, ఆయన తనను పదేళ్లు ఏడిపించి ఆ తర్వాత కోర్టులో రాజీ పడ్డారని తెలిపారు. చంద్రబాబునూ కన్నా ఏడిపించారని, అయితే కొన్ని కారణాల వల్ల టిడిపిలో చేరారని చెప్పారు. ఎన్ని విభేదాలున్నా చంద్రబాబు నాయకత్వంలో కన్నాతో కలిసే పని చేస్తామని, ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారని చెప్పారు. తాను ఏ ఇన్‌ఛార్జులకూ వ్యతిరేకంగా ఇతరులను ప్రోత్సహించడం లేదని, ఏమైనా ఉంటే చంద్రబాబుకే చెబుతానని అన్నారు. మాచర్ల టిక్కెట్ బ్రహ్మారెడ్డికి ఇస్తే కచ్చితంగా గెలుస్తాడని, గురజాలలో ఎలా ఉంటుందో తెలియదని, ఏదైనా అవినీతి లేని వ్యక్తులకు టిక్కెట్ ఇవ్వడం మంచిదని రాయపాటి వ్యాఖ్యానించారు.










