Nov 07,2023 20:45

ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు
ప్రజాశక్తి - నరసాపురం టౌన్‌
ఈ నెల 14వ తేదీ నుంచి కార్తీకమాసం ప్రారంభం కానుండడంతో పేరుపాలెంబీచ్‌ వద్ద పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అధికారులను ఆదేశించారు. బీచ్‌ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద వీసి హాల్లోలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో ముదునూరి ప్రసాదరాజు సమీక్షించారు. ఈ సమావేశానికి ఆర్‌డిఒ ఎం.అచ్యుత అంబరీష్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్‌విప్‌ ప్రసాదరాజు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబరు 12వ తేదీ వరకూ కార్తీకమాసం కావడంతో మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారన్నారు. జిల్లా నుంచే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా వచ్చే పర్యాటకులతో బీచ్‌ కిక్కిరిసిపోతుందన్నారు. పర్యాటకులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల కాలంలో పేరుపాలెంబీచ్‌ వద్ద సముద్రంలో స్నానాలకు దిగి గల్లంతైన ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. ఏటా కార్తీక మాసంలో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పోలీస్‌ శాఖ ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. బీచ్‌లో ప్రమాద స్థలాలను గుర్తించి నిఘా పెట్టాలన్నారు. పర్యాటకులు సముద్రం లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించాలని ఆర్‌డిఒకు సూచించారు. పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్‌టిసి బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌డిఒ అచ్యుత అంబరీష్‌ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తంగా ఉండి, పర్యాటకులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే బీచ్‌లో స్థానాలకు అనుమతిస్తామన్నారు. బీచ్‌ వద్ద ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మద్యం తాగి అల్లర్లు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొగల్తూరు జెడ్‌పిటిసి ి తిరుమల బాబ్జి నరసాపురం తహశీల్దార్‌ సయ్యద్‌ మౌలాల పాజిల్‌, మొగల్తూరు తహశీల్దార్‌ జి.అనితకుమారి, జి.శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.