Oct 15,2023 22:39

ప్రజాశక్తి- యాదమరి: మండలంలో గత ఐదు నెలలుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ పోస్ట్‌ ఖాళీగా ఉన్నది. ఇక్కడ పనిచేస్తున్న ఆర్‌ఐ జ్యోతిని మే 10వ తేదీన ఉన్నఫలంగా బదిలీ చేశారు. అప్పటి నుండి యాదమరి రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ పోస్టు ఖాళీగానే ఉన్నది. రెవెన్యూలో భూసమస్యలు నివేదికలు పంపించడంలో ఆర్‌ఐ పాత్ర కీలకం. వీఆర్వో నుండి తహశీల్దార్‌ వరకు ప్రతి నివేదికను ఆర్‌ఐ విచారణ చేసి పైఅధికారులకు అందించాల్సి ఉంది. ఆర్‌ఐ లేకపోవడంతో వీఆర్వోలు, తహశీల్దార్లపై పనిఒత్తిడి పెరిగింది. మండలంలో భూసమస్యలు అధికంగా ఉన్నాయి. ఇటీవల మండల కేంద్రంలో జాయింట్‌ కలెక్టర్‌, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారుల సమక్షంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంకు మండలం మొత్తం వివిధ సమస్యలపై 211 అర్జీలు రాగా అందులో యాదమరి రెవెన్యూ శాఖ సంబంధించి 196 భూ సమస్యలపైనే వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే యాదమరిలో భూసమస్యలు ఏ మేరకు ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం స్పందన అర్జీలు సమస్యలు పరిష్కార దిశగా వీఆర్వోలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
భూసమస్యలు నివేదికల సిద్ధం చేసేందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ పాత్ర కీలకం. ఆర్‌ఐ విచారణ చేసి పూర్తి నివేదికను పై స్థాయి అధికారులకు పంపించాల్సి ఉంటుంది. మండల పరిధిలో అధికంగా భూవివాదాలు, కోర్టు కేసులు, రీసర్వే, మ్యూట్యులేషన్స్‌, అసైన్మెంట్‌ కమిటీ భూముల గుర్తింపు, స్పందన అర్జీలు, కులధ్రువీకరణ సర్టిఫికెట్స్‌, రేషన్‌షాపుల తనిఖీలు, గ్రామసభలు, భూవివాదాల సమస్యలపై విచారణ ఏసమస్య అయినా రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ నివేదిక తప్పనిసరి. రెవెన్యూలో కీలకంగా వ్యవహరించాల్సిన ఆర్‌ఐ పోస్టు ఖాళీగా ఉండడంతో రైతుల భూసమస్యను, మరే ఇతర సమస్యలు నిర్ణీత గడువుల పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. ఆర్‌ఐ లేకపోవడంతో రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది. రైతులు వీఆర్వోలను ప్రశ్నిస్తే తమ పరిధిలో లేదని మేము నివేదికను తహశీల్దార్‌కు సమర్పించామని చేతులు దులుపుకుంటున్నారు.
అధికారుల ఆదేశాలు పాటించరా..?
యాదమరి మండలంలో ఆర్‌ఐ పోస్టు ఖాళీగా ఉండడంతో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గతవారం చిత్తూరు ఆర్‌ఐగా ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సంతోష్‌ను చిత్తూరు తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐగా నియమించి, చిత్తూరు తహశీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్‌ఐ ప్రసాద్‌ను యాదమరికి రెవెన్యూ ఇన్స్పెక్టర్‌గా బదిలీ చేశారు. పై అధికారులు బదిలీ చేసిన గానీ ఆర్‌ఐ విధుల్లో ఇంతవరకు చేరలేదు. ఎందుకు చేరలేదని సంబంధిత అధికారులకే తెలియాల్సి ఉంది. గ్రూప్‌ 4లో సెలెక్ట్‌ అయిన మునియజ్ఞ తేజను యాదమరి తహశీల్దార్‌ కార్యాలయం జూనియర్‌ అసిస్టెంట్‌గా వేశారు. వీరిద్దరూ విధుల్లో చేరాల్సి ఉంది.
ఎన్నికల విధులకు ఆర్‌ఎస్‌డి, డిప్యూటీ తహశీల్దార్‌
మండలంలో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న, డిప్యూటీ తహశీల్దార్‌, రిసర్వ్‌ డీటీలు ఎన్నికల విధులకు 15 రోజులపాటు వెళ్ళనున్నారు. వెంటనే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి యాదమరికి ఆర్‌ఐ, జూనియర్‌ అసిస్టెంట్లు విధుల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు, ప్రజలు కోరుతున్నారు.