ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25 శాతం ఫ్రీ సీట్లు ఇవ్వాలని నిబంధన
నిబంధనలు అమలు చేయాల్సిందేనని ఇటీవల కోర్టు హెచ్చరిక
ప్రస్తుతం కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
రెండు జిల్లాల్లో 880 వరకూ ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లు
ఇప్పటి వరకూ 406 మంది విద్యార్థులకే సీట్లు
ప్రచారం లేకపోవడంతో దరఖాస్తులు రాని దుస్థితి
ఒక కిలోమీటర్ పరిధిలో స్కూల్ ఉంటేనే అవకాశం
ఉచిత సీట్లకు సైతం సాకులు చూపుతూ ఫీజు గుంజుడు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
కార్పొరేట్, ప్రయివేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇచ్చే 25 శాతం ప్రవేశాలకు పలు ఫీజులుంటారు అనే రీతిలో స్కూళ్ల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు తల్లిదండ్రుల్లో చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో ఉచిత ప్రవేశాలపై సరైన ప్రచారం లేకపోవడంతో దరఖాస్తులు పెద్దగా రాని పరిస్థితి రెండు జిల్లాల్లోనూ నెలకొంది. దీంతో రెండు జిల్లాల్లోనూ ఉచిత ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్య నామమాత్రంగా ఉంది. విద్యాహక్కుచట్టం 2009 ప్రకారం ప్రతి ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే ప్రభుత్వాలు అమలు చేయించడం లేదు. దీనిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గతేడాది నుంచి దరఖాస్తుల ఆహ్వానం సాగుతోంది. ప్రస్తుతం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ సాగుతోంది. ఏలూరు జిల్లాలో 527, పశ్చిమగోదావరిలో 360 వరకూ ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఫస్ట్, సెకండ్ ఫేజ్ కింద రెండు విడతల్లో ఒకటో తరగతిలో చేరే విద్యార్ధులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జరిగింది. ఇప్పటి వరకూ ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఏలూరు జిల్లాలో 256 మంది, పశ్చిమలో 204 మంది మాత్రమే ఉన్నారు. రెండు జిల్లాల్లో ఒక్కో స్కూల్‌లో 25 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం లభించినా 22 వేల మంది పేద విద్యార్థులకు అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకూ సీట్లు పొందిన వారి సంఖ్య చూస్తే వందల్లో కూడా లేదు.
ఉచిత సీటైనా తప్పని ఫీజుల ఒత్తిడి
ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు పొందిన విద్యార్థుల నుంచి యాజమాన్యాలు అనేక సాకులు చెబుతూ సొమ్ము గుంజుతున్నాయనే ప్రచారం సాగుతోంది. బహిరంగంగా తల్లిదండ్రులు వెల్లడించలేకపోతున్నప్పటికీ వసూళ్లపై మాత్రం చర్చ సాగుతోంది. ఉచిత ప్రవేశాలు పొందిన విద్యార్థుల నుంచి అడ్మిషన్ ఫీజు, ఎన్‌రోల్‌మెంట్ ఫీజు పేరిట దాదాపు రూ.మూడు వేల వరకూ వసూలు చేస్తున్నట్లు సమాచారం. స్కూల్ స్థాయిని బట్టి పుస్తకాలకు రూ.ఐదు వేలకుపైగా బాదేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అనేక కారణాలు చెబుతూ ఫీజు వసూలు చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. దీంతో గత్యంతరం లేక కొంతమంది ఫీజులు చెల్లిస్తున్నారు. ఉచిత ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఎటువంటి ఫీజూ చెల్లించొద్దని విద్యా శాఖాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితి ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ప్రయివేటులో ఉచిత ప్రవేశాలపై ప్రచారం కరువు
కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి విద్యాశాఖ సరైన ప్రచారం చేయకపోవడంతో దరఖాస్తులు రావడం లేదని తెలుస్తోంది. వాలరటీర్ వ్యవస్థ ఉన్నప్పటికీ దీనిపై సరైన ప్రచారం లేదనే చెప్పాలి. అధికారులు సైతం మీడియా సమావేశాలు పెట్టి వివరించిన పరిస్థితి లేదు. ఏదో మమ అన్నట్లు మాట్లాడి సరిపెడుతున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలపై ఉపాధ్యాయులకు సైతం సరైన సమాచారం లేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రూ.వేలకు వేలు ఫీజు కట్టలేక సతమతమవుతున్న పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఉచిత ప్రవేశాల గురించి ప్రచారం లేకపోవడంతో తెలియని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఉచిత ప్రవేశం పొందే విద్యార్థి స్కూల్‌కు ఒక కిలోమీటర్ దూరంలో ఉండాలనే నిబంధన సైతం పెనుశాపంగా మారింది. ఈ నిబంధనతో గ్రామాల్లో విద్యార్థులకు ప్రవేశం లేకుండాపోతోంది. మండల కేంద్రం, పట్టణాల్లో ఉన్న కొద్దిమందికి మాత్రమే అవకాశం లభించే పరిస్థితి ఉంది. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15వ తేదీ వరకూ సమయం ఉంది. ఇప్పటికైనా ప్రయివేటులో ఉచిత ప్రవేశాలపై పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తే పేద విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.










