Jul 15,2023 00:25

క్యూలో నిలుచున్న రోగులు

ప్రజాశక్తి -నక్కపల్లి:నక్కపల్లి 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ ఇందుకు తగిన వైద్య పరికరాలు లేకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు అవస్థలు పడుతున్నారు. రేడియోగ్రాఫర్‌ ( ఎక్స్‌ రే తీసే వ్యక్తి ) లేక పోవడంతో గత ఎనిమిది రోజుల నుండి ఎక్స్‌ రే రూమ్‌ మూతపడడంతో ఎక్సరేలు తీయడం లేదు. దీంతో, ఎక్స్‌ రే అవసరం అగు రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక్కడ పని చేసిన రేడియో గ్రాఫర్‌ బదిలీ కావడంతో ఎలమంచిలి నుండి కొత్తగా వచ్చిన రేడియోగ్రాఫర్‌ జూన్‌ నెల 23 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు విధులు నిర్వహించి, 8వ తేదీ నుండి రాక పోవడంతో ఎక్స్‌ రే రూమ్‌ మూతపడింది. ఎక్స్‌ రే తీసేవారు లేక పోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులకు ఎక్స్‌ రే అవసరం పడితే చేసేదేమీ లేక తుని, అనకాపల్లి ఆసుపత్రులకు వైద్యులు రిఫర్‌ చేస్తున్నారు. దీంతో, ఎక్స్‌ రే అవసరమగు రోగులు పడరాని పాట్లు పడుతున్నారు.
కొత్త ఎక్స్‌ రే మిషన్‌ ఏర్పాటు చేయాలి
ఎక్స్‌ రే తీసే మిషన్‌ కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తుంది. గతంలో మిషన్‌ మొరాయిస్తే మరమ్మత్తు పనులు చేపట్టి వాడుకలోకి తీసుకు వచ్చారు. మిషన్‌ ఎన్ని రోజులు పని చేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఎక్స్‌ రే తీసే మిషన్‌ కూడా కొత్తది ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈసిజి సేవలు అందించాలి
ఈసిజి మిషన్‌ గత 8 నెలల క్రితమే మరమ్మతుకు గురైంది. నిధుల సమస్య కారణంగా కొత్త మిషన్‌ కొనుగోలు చేయలేదు. ఈసీజీ మిషన్‌ ఊసే లేకుండా పోయింది. రోగులకు ఈసీజీ సేవలను వైద్యులు అందించలేక పోతున్నారు. ఈసి జి మిషన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు డిమాండ్‌ చేశారు .
పెరిగిన రోగుల తాకిడి
గతంతో పోల్చుకుంటే నక్కపల్లి ఆసుపత్రికి రోగులు తాకిడి విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 200 వరకు ఓపి చూస్తే, ఇప్పుడు 300 నుండి 350 వరకు ఓపి పెరిగింది. నక్కపల్లి మండలంతో పాటు ఎస్‌.రాయవరం మండలం నుండి కూడా రోగులు వైద్యం కోసం నక్కపల్లి ఆసుపత్రికి వస్తున్నారు. దీంతో, ఆసుపత్రి ప్రతిరోజు రోగుల తాకిడితో కిటలాడుతుంది. పాయకరావుపేట, ఎస్‌ రాయవరం మండలం పెనుగొల్లు ధర్మవరం జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగత్రులకు నక్కపల్లి ఆసుపత్రిలో సరైన వైద్య పరికరాలు ,అందుబాటులో రక్తం లేకపోవడంతో వైద్యులు ప్రథమ చికిత్సను అందించి మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి లేదా విశాఖపట్నం ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. అక్కడికి వెళ్లే లోపు క్షతగాత్రులు మార్గ మధ్యలోనే మృత్యువాత పడుతున్నారు. ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య పరికరాలు,సౌకర్యాలు కల్పించి ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. అదేవిధంగా జనరల్‌ ఫిజీషియన్‌ సర్జన్‌ను నియమించి ఆసుపత్రికి వచ్చే రోగులకు, క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.