Sep 02,2023 00:17

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌
రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డుకు ఇడుపులపాడు విద్యా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పిడపర్తి పేరిరెడ్డి ఎంపికయ్యారు. పిడపర్తి పేరిరెడ్డి 1992లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా విద్యా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేరారు. 2003లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్)గా పదోన్నతి పొందారు. 2010 నుండి 2017 వరకు ఎఫ్ఎసి హెచ్‌ఎంగా విధులు నిర్వహించారు. 2017లో రెగ్యులర్ హెచ్‌ఎంగా బాధ్యతలు స్వీకరించారు. సర్వీసులో చేరిన నాటి నుండి అంకితభావంతో సెలవులు పొదుపుతో వాడుకోవటంలో పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులు ప్రగతికి నిరంతరం కృషి చేస్తున్నారు. రెండో వ్యాపకం లేకుండా విద్యాభివృద్ధి ఆశయంతో అంకితభావంతో పని చేస్తున్నారు. 2000సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఎన్సిసి అధికారిగా పని చేస్తూ సేవలందిస్తున్నారు. గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు ఎన్సిసి విద్యార్థులు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. 2009వ సంవత్సరంలో నేషనల్ గ్రీన్ కోర్ పర్చూరు డివిజన్ గ్రీన్ మాస్టర్ ట్రైనర్ గా పనిచేశారు. పేరిరెడ్డి చేసిన సేవలకు 2002, 2003లో ఎన్సిసి గుంటూరు గ్రూపు నందు ఉత్తమ ఎన్సిసి అధికారిగా అవార్డు వరించింది. 2008లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. పాఠశాలలో నందు గాని, పర్చూరు నేషనల్ గ్రీన్ కోర్‌కు చేసిన కృషి ఫలితంగా 2010లో జనవరి 26న అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే చేతుల మీదుగా ఉత్తమ గ్రీన్ పాఠశాల అవార్డు అందుకున్నారు. 2011, 2016లో తిరుపతిలోని సివిఎన్, తేజ చారిటబుల్ ట్రస్ట్  నుండి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ వార్డు తీసుకున్నారు. 2021లో ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తక రచయితగా పని చేసి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపికైనందుకు పాఠశాల పాలకవర్గ అధ్యక్షులు చెంచు పున్నయ్య, పాఠశాల కరస్పాండెంట్ గోరంట్ల పున్నయ్య, పాఠశాల సిబ్బంది పేరిరెడ్డిని అభినందించారు.