Sep 05,2023 23:28

 మేడికొండూరు: మండలంలోని పేరేచర్ల గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు సెప్టెంబర్‌ 15వ తేదీ లోగా పరిష్కారం చేయ ని పక్షంలో, 16వ తేదీ నుండి సమ్మెతో సహా అన్ని రకాల పోరాటాలకు సిద్ధం అవుతామని పేరేచర్ల గ్రామపంచాయతి కార్యదర్శికి ఎపి గ్రామపంచాయతి ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా పేరేచర్ల గ్రామపంచాయతి కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ పంచాయతి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే సెప్టెంబర్‌ 11వ తేదీ నుండి గ్రామంలో నిరసన కార్యక్రమాలు చేపడతారని, 16వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు పూనుకుంటారని హెచ్చరించారు. తద్వారా గ్రామస్తులు అసౌకర్యానికి గురైతే దానికి పంచాయతి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేశారు. ధర్నా అనంతరం పంచాయతీ కార్యదర్శి ఎండి ఎ. రహమాన్‌కి సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడికొండూరు మండల కార్యదర్శి వై మోహన్‌, గ్రామపంచాయతి నాయకులు ఎన్‌ రత్తయ్య డి నాగరత్నం ఈ చార్లెస్‌ డి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.