Apr 24,2022 10:36

కష్టాలను ఎదుర్కోవడం జీవితంలో ఒక భాగం. కానీ ఆ కష్టాలతో పోరాడి విజయం సాధించిన వారికి మాత్రమే ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అలాంటివారు తమ జీవిత గమనంలో ఎన్నో అవహేళనలనూ, అపజయాలనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానిని లెక్కజేయకుండా ప్రపంచానికి తామేంటో నిరూపించకునేందుకు కష్టపడినవారే విజయానికి చేరువవుతారు. అలాంటి కోవకు చెందినవారే మధ్యప్రదేశ్‌కు చెందిన నిరీష్‌ రాజ్‌పుత్‌. ఇటీవల యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ పరీక్షల్లో విజయం సాధించారు. ఆయన సక్సెస్‌ స్టోరీ తెలుసుకుందాం.

 

పేపర్‌ బాయ్.. ఐఏఎస్‌ !



చాలా మంది యువత మాదిరిగానే అతడూ ఐఏఎస్‌ కావాలని కలలు కన్నాడు. అతని స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం అహర్నిశలూ శ్రమించాడు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకున్నాడు. దేశంలో అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటి యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌ పరీక్షకు సన్నద్ధమయ్యాడు. ఇందులో ఉత్తీర్ణత సాధించడంలో మూడుసార్లు విఫలమైనా పట్టు వదలకుండా నాల్గోసారి విజయం సాధించాడు. అయితే ఇందుకు ఎక్కువ మంది ఔత్సాహికులు కోచింగ్‌ సెంటర్లలో చేరితే.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సొంతంగానే ప్రిపేరయ్యాడు నిరీష్‌ రాజ్‌పుత్‌. పేద కుటుంబనేపథ్యం నుంచి వచ్చి ఏకంగా ఐఏఎస్‌ అయ్యాడు. తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు.
      మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాకు చెందిన నిరీష్‌ రాజ్‌పుత్‌ నిరుపేద కుటుంబానికి చెందినవారు. జిల్లాలోని గోహద్‌ మండలంలోని మౌ గ్రామం వీరిది. నిరీష్‌ కోచింగ్‌ లేకుండానే యుపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యాడు. ఆల్‌ ఇండియా లెవల్‌లో 370వ ర్యాంకు సాధించి, ఐఏఎస్‌ అధికారి కావాలనే తన కలను సాకారం చేసుకున్నాడు. నిరీష్‌ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాల్లోనే చదువుకున్నాడు. పరీక్షల ఫీజుల కోసం ఇంటింటికీ తిరిగి పేపర్‌ వేసేవాడు. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును మాత్రం ఆపలేదు. గాల్వియర్‌లోని ప్రభుత్వ కళాశాలో గ్రాడ్యుయేట్‌ పూర్తిచేశాడు. ఇందుకోసం అతని సోదరులు సహాయం చేశారు. యుపిఎస్‌సి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు హాజరయ్యే ముందు ఐఎఎస్‌ అధికారి ఎలా కావాలో అతనికి తెలియదు. కానీ, యుపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో విజయం సాధిస్తే ప్రజల జీవితాలను మార్చవచ్చన్న సంగతి అతనికి తెలుసు.
 

                                                      పేదరికం వెంటాడుతున్నా..

పేదరికం వెంటాడుతున్నా ఐఏఎస్‌ అధికారి కావాలన్న తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు ఎన్నో కష్టనష్టాలను భరించాడు. ఆయన ఇల్లు కేవలం 300 చదరపు అడుగులు మాత్రమే ఉంటుంది. తండ్రి వీరేంద్ర రాజ్‌పుత్‌ టైలర్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిరీష్‌కు ఇద్దరు సోదరులు. వారు టీచర్‌ ఉద్యోగం చేస్తున్నారు.
 

                                                           ఇంట్లోనే ప్రిపరేషన్‌..

ఆర్థిక ఇబ్బందులు కారణంగా యూపీఎస్‌సీ పరీక్షల కోసం ఇంటిలోనే ప్రిపేర్‌ అయ్యాడు. ఇందుకు అతని సోదరులు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో, ఉత్తరాఖండ్‌లో కొత్తగా ప్రారంభించిన కోచింగ్‌ సెంటర్‌లో బోధించడానికి తన స్నేహితుల్లోని ఒకరు నిరీష్‌ను సంప్రదించారు. ప్రతిఫలంగా యూపీఎస్‌సీ పరీక్షల కోసం స్టడీ మెటీరియల్స్‌ ఇస్తానని అతను నిరీష్‌కు హామీ ఇచ్చాడు.
     రెండేళ్లు గడిచేసరికి కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ బాగా వృద్ధి చెందింది. దీంతో నిరీష్‌ అవసరం లేదని భావించిన అతని స్నేహితుడు మోసం చేశాడు. రెండేళ్లపాటు కోచింగ్‌ సెంటర్‌లో పాఠాలు చెప్పినా ప్రతిగా ఎటువంటి ప్రతిఫలం పొందలేదు. రెండేళ్ల కాలం వృధా అయ్యిందని గ్రహించిన నిరీష్‌ ఈ ఘటన నుంచి గుణపాఠం నేర్చుకున్నాడు. చేసేది లేక కట్టుబట్టలతో ఢిల్లీకి బయలుదేరాడు. అక్కడ యూపీఎస్సీ పరీక్షల కోసం ప్రిపరేషన్‌ మొదలుపెట్టాడు.
 

                                                           నాల్గో ప్రయత్నంలో..

యూపీఎస్సీ పరీక్షల కోసం ఢిల్లీలో సన్నద్ధమవుతున్న అనేకమంది ఔత్సాహికులను కలుసుకున్నాడు. ప్రిపరేషన్‌ ఎలా అవ్వాలో వారు నిరీష్‌కు వివరించారు. వారిలో కొంతమంది నోట్స్‌ ప్రిపరేషన్‌లో సహాయం చేశారు. తద్వారా రోజుకు 18 గంటలపాటు పరీక్షకు ప్రిపేరయ్యేవాడు. ఎటువంటి కోచింగ్‌ సెంటర్‌లలో కోచింగ్‌ తీసుకోకుండానే తన నాల్గో ప్రయత్నంలో సివిల్స్‌ పరీక్షల్లో ఆల్‌ ఇండియా లెవల్లో 370వ ర్యాంకు సాధించాడు. తన చిరకాల కోరిక అయిన ఐఏఎస్‌ను సాధించి, ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచాడు.