Nov 11,2023 22:25

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి దీపావళి టపాసులు కొనుగోలు చేయకముందే పేలుతున్నాయి. రిటైల్‌ ధరలు ఆకాశాన్నంటడంతో కొనుగోలు దారులకు చుక్కలు కన్పిస్తున్నాయి. పండుగలన్నింటిలో దీపావళి ప్రత్యేకమైనది. టపాసులు పేల్చ డంపై చిన్నారులతోపాటు యువత ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఆసక్తినే ఆధారం గా చేసుకుని ధరలు నింగినితాకు తున్నాయి. గతేడాదితో ధరలతో పొల్చితే 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. రిటైల్‌ షాపులలో బాణా సంచా ఏది కొందామన్న రూ.100లపె ౖమాటే. అగ్గిపెట్టె నుంచి థౌజండ్‌ వాలా వరకు అన్ని ధరలు పేలుతున్నాయి. కెమికల్స్‌ ధరల పెరుగుదలతోపాటు లేబర్‌ ఖర్చులు, ట్రాన్స్‌పోర్టు, పన్నులు, దుకాణ అద్దెల ప్రభావం పడిందని, ఆందుకే ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్పుతున్నారు. జిల్లా కేంద్రంలోని రాజమహేంద్రవరంతోపాటు దాదాపుగా అన్ని మండల కేంద్రాల్లోనూ బాణా సంచా దుకాణాలు ప్రారంభం ఆయ్యాయి. అయితే ఆయా దుకాణాల వద్ద శనివారం నుంచి రద్దీ పెరిగింది. వ్యాపారుల వద్దే ధరలు పేలుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కోట్లలో వ్యాపారం
జిల్లాలో దీపావళి పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో ఏదో బాణసంచా మోత వినిపిస్తుంది. డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ పండుగ జరుపుకుంటారు. ఈ కారణంగా వ్యాపారం ప్రతి ఏటా కోట్లలో జరుగుతుంది. జిల్లా కేంద్రంమైన రాజమహేంద్రవరంతోపాటు కొవ్వూరు, నిడదవోలు, గోకవరం, బిక్కవోలు తదితర అన్ని మండల కేంద్రాల్లోనూ లైసెన్స్‌ దుకాణాలు ప్రారంభం అయ్యాయి. ప్రతి ఏటా వ్యాపారం పెద్ద మొత్తంలో జరుగుతుంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్లు జిల్లాలో దీపావళి పండుగ పెద్దగా జరగలేదు. గతేడాది దుకాణాల్లో సరుకు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈసారి కూడా డిమాండ్‌ ఇదే విధంగా ఉంటుందని భావించి వ్యాపారులు పెద్ద ఎత్తున స్టాక్‌ తీసుకొచ్చారు. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో మూడు రోజుల నుంచి వ్యాపారం జోరుగా సాగుతోది.
గతంతో పోల్చితే 20 నుంచి 30 శాతం పెంపు
దీపావళిలో ఎక్కువుగా పిల్లలు ఇష్టపడి కాల్చే కాకరపువ్వొత్తులు సాదా బాక్స్‌ ధర మంచి కంపెనీ అయితే రూ.90 నుంచి రూ.110 ఉంది. గత ఏడాది రూ.60 నుంచి 70 ఉండేది. చిచ్చుబుడ్డులు చిన్నవి పది ఉండే చిన్న బాక్స్‌ రూ.60 నుంచి 80 ఉంది. గతేడాది రూ.40 నుంచి 60 మధ్య ఉండేది. అదే పెద్దవి అయితే మంచి కంపెనీ రూ.300 వరకు పలుకుతుంది. తాళ్లు చిన్న పెట్టె రూ.40, పెద్దవి రూ.80, సీమటపాసులు చిన్నది బాక్స్‌ రూ.50 పలుకుతోంది. భూ చక్రాలు గతేడాది రూ.70 నుంచి రూ.80 ఉండేది. ఇప్పుడు రూ.100 నుంచి రూ.120 దాకా ఉంది. 5000 వాలా బాంబు దండ గతంలో రూ.1200 నుంచి రూ.1300 ఉండేది. ఇప్పుడది రూ.1500 నుంచి రూ 1800 పలుకుతోంది. 1000 వాలా మంచి రకం గతంలో రూ.2 వేలు ఉండేది. ఇప్పుడు రూ.2500 ఉంది. ఇందులో సాదా రకం రూ.1800 ఉంది. ఇలా అన్ని రకాల ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి.