
దీపావళి వచ్చిందంటే చాలు చిన్నారుల నుంచి పెద్దలు వరకు ఒకటే సందడి. ఎంత ధరైనా బాణసంచా కొనుగోలు చేసి ఇంటిళ్లపాదీ సంతోషంగా దీపావళి జరుపుకునేందుకు సిద్ధమవుతారు. అందుకే పేలుడు ఘనటలకు తావు లేకుండా ఉంటేందుకు బాణాసంచా విక్రయాలకు ఒకటి, రెండు రోజులు మాత్రమే అనుమతిస్తారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. దీంతో దీపావళి టపాసులు కొనుగోలు చేయాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏకంగా అసలు ధరకు రెట్టింపునకు పెంచి అమ్మకాలు చేపడుతుండడంతో ఇవేమీ ధరలు అంటూ కొందరు వెనుదిరుగుతున్నారు. అసలే పండగ,
కొత్త దుస్తులు, పిండి వంటకాలు వండుకుందామన్నా
మార్కెట్‌కు వెళ్లలేని పరిస్థితి.
ప్రజాశక్తి- జిల్లా విలేకరుల యంత్రాంగం: జిల్లాలో దీపావళి టపాసుల షాపులకు తాత్కాలికంగా అధికారులు అనుమతులు మంజూరు చేశారు. శ్రీకాకుళం నగరంలో 29, రూరల్ మండలంలో 6, గార మండలంలో 4, నరసన్నపేట మండలంలో 7, పోలాకి మండలంలో 4, కోటబొమ్మాళి మండలంలో 5, ఆమదాలవలస మండలంలో 2, బూర్జ మండలంలో ఒకటి, ఎచ్చెర్ల మండలంలో 8, లావేరు మండలంలో ఒకటి, రణస్థలం మండలంలో రెండు, పొందూరు మండలంలో రెండు, జలుమూరు మండలంలో 2, జి.సిగడాం మండలంలో ఒకటి, ఇచ్ఛాపురం మండలంలో ఒకటి, టెక్కలి మండలంలో 4, వజ్రపుకొత్తూరు మండలంలో 4, పలాస మండలంలో 5, మందస మండలంలో 3, కొత్తూరు 2, మందస మండలంలో 2, సంతబొమ్మాళి ఒకటి, సరుబుజ్జిలి ఒకటి చొప్పున తాత్కాలికంగా అనుమతి ఇచ్చారు. వలస వెళ్లిన వారు స్వగ్రామాలకు పండగ పూట చేరుకోవడం వల్ల నుంచి కొనుగోలుతో ఈ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇతర మండలాల నుంచి చిన్నచిన్న వ్యాపారులు సైతం ఇక్కడే కొనుగోలు చేసి ఆయా ప్రాంతాల్లో విక్రయాలు చేస్తుంటారు. అయితే మందుగుండు సామగ్రి ధరలు మాత్రం టపాసుల్లా పేలుతున్నాయి.
గతేడాది కంటే రెట్టింపు ధరలకు అమ్మకాలు
గతేడాది రూ.13,00 పలికిన ఫ్యామిలీ ప్యాక్ ధర ఈ ఏడాది రూ.2 వేల వరకు అమ్ముతున్నారు. దీపావళి టపాసులు గతేడాది తారాజువ్వలు ప్యాకెట్ రూ.40కు అమ్మితే ఈ ఏడాది రూ.వందకు విక్రయిస్తున్నారు. సుచ్చుబుడ్డులు రెండు రూ.50 నుంచి రూ.వందకు పెంచేశారు. కాకర్లు గతేడాది రూ.30 ఉంటే... ఈ ఏడాది రూ.80, లక్ష్మీ బాంబులు రూ.110 ఉంటే... ప్యాకెట్ రూ. 250కు పెంచేశారు. 120 షాట్స్ బాక్స్, ఫ్యామిలీ ప్యాక్ బాక్స్ రూ.1200 గతేడాది ఉండగా, ఈ ఏడాది ఏకంగా రూ.2,400 ధరలు అధికంగా ఉన్నాయి. వీటిని కొనుగోలు కోసం వెళ్లే ప్రజలు ధరలను చూసి ఆందోళన చెంది... కొందరు నిరాశతో వెనుతిరుగుతున్నారు. నిర్వాహకులూ గతేడాది టపాసులు విక్రయాలను మూడు రోజుల అనుమతులకు వివిధ రకాల పన్నుల రూపంలో రూ.9 వేలు చెల్లించేవారు. ఈ ఏడాది రూ.30 వేలు చెల్లించామని, దీనికి తోడు సగానికి పైగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, రాజకీయ ప్రముఖులకు, చోటామోటా కార్యకర్తలకు ఇవ్వక తప్పడం లేదని వాపోతున్నారు. ఈ నష్టాన్ని వినియోగదార్లపైనే వేయాల్సి వస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరల భారాన్ని మోయలేక ఇంకేమి కాలుస్తామంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు.
రేట్లు అధికమే...
పిల్లలకు టపాసులు కొందామని వెళ్తే అక్కడి రేట్లు చూస్తే గుండె గుబేల్ మంటున్నాయి. అయ్యన్ టపాసులు కావాలంటే గతంలో 80 శాతం డిస్కౌంట్ ఇచ్చే వారు. కానీ ఈ ఏడాది 20 శాతం మాత్రమే రిబేటు ఇస్తూ వ్యాపారులు దోచుకుంటున్నారు. గతేడాదికి, ఈ ఏడాదికి 50కి 50 శాతం అధిక ధరలు పెంచారు. ఇలా అయితే దీపావళి ఎలా చేసుకోవాలో!.
- ఆకేటి రమణ, నిమ్మతొర్లాడ, ఆమదాలవలస మండలం
అధికారులు పర్యవేక్షించాలి
మాకు అందుబాటులో టపాసుల విక్రయాలు జరగడం లేదు. మండలంలోని అధిక శాతం జనాభా ఒడిశా నుంచే బాణసంచా కొనుకుంటారు. మా మండలంలో రహస్యంగా కొన్ని విక్రయాలు జరిగినా ధరలు బాంబుల్లా పేలుతుంటాయి. ఒడిశాలో కూడా ఎక్కువ ధరకే కొంటున్నాం. ప్రతి ఇంట్లో జరుపుకునే ఈ పండుగలో టపాసులదే అగ్ర స్థానం. కాబట్టి అధికారులు అన్ని విధాలుగా చర్యలు తీసుకుని సరసమైన ధరలకు టపాసులు అందిస్తే మాలాంటి చిన్న, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుంది.
- ఆర్.మహేష్, కపాసుకుద్ది, కవిటి మండలం