
ప్రజాశక్తి-రాజోలు టపాసుల ధరలు పేలిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే అన్ని ధరలూ 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. ఏది కొందామన్నా రూ.100పైనే ఉంది. రూ.1000 తీసుకెళితే చిన్న క్యారీ బ్యాగ్ కూడా నిండడం లేదు. దుకాణాలకు వెళితే ధరలు చూసి చెమటలు పడుతున్నాయి. అగ్గిపెట్టె నుంచి థౌజండ్ వాలా వరకు అన్నింటి ధరలూ పేలుతున్నాయి. లేబర్, ట్రాన్స్‌పోర్టు, పన్నులు, దుకాణ అద్దెలు, కెమికల్స్ ధరల పెరుగుదల టపాసులపై పడిందని, ఆందుకే ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్పుతున్నారు. ప్రస్తుతం లెసెన్స్ దుకాణాల్లోనే విక్రయాలు సాగుతున్నాయి. ఇంకా తాత్కాలిక లెసెన్స్‌తో గ్రామాలు, పట్టణాల్లో అమ్మే దుకాణాలు పెట్టలేదు. ఈ వ్యాపారులంతా హోల్‌సేల్ దుకాణదారుల నుంచి కొనుగోలు చేసి దుకాణాలు వేసి అమ్ముతుంటారు. ఈ కారణంగా ఇక్కడ ధరలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. ప్రస్తుతం హోల్‌సేల్ వ్యాపారుల వద్దే ధరలు పేలుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు టపాసులు కాల్చాగలమా అన్న సందేహంలో పడ్డారు.
జిల్లాలో రూ.కోట్లలో వ్యాపారం
జిల్లాలో దీపావళి పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో ఏదో బాణసంచా మోత వినిపిస్తుంది. డబ్బులు లేకపోయినా అప్పు చేసి పండుగ జరుపుకుంటారు. ఈ కారణంగా వ్యాపారం ప్రతి ఏటా రూ.కోట్లలో జరుగుతుంది. జిల్లాలో లైసెన్స్ దుకాణాలు అత్యధికంగా అమలాపురం, ముమ్మిడివరం, రావులపాలెం, రామచంద్రాపురం ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి కాక పండుగ మూడు రోజులు తాత్కాలిక లైసెన్స్ పొంది ఏర్పాటు చేసే సంఖ్య కూడా ఎక్కువుగా ఉంటుంది. ఈ కారణంగా వ్యాపారం కూడా పెద్ద మొత్తంలో జరుగుతుంది. కొవిడ్ కారణంగా రెండేళ్లు జిల్లాలో దీపావళి పండుగ పెద్దగా జరగలేదు. గతేడాది దుకాణాల్లో సరుకు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈసారి కూడా డిమాండ్ ఇదే విధంగా ఉంటుందని భావించి వ్యాపారులు పెద్ద ఎత్తున స్టాక్ పెట్టారు. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో మూడు రోజుల నుంచి జోరుగానే వ్యాపారం సాగుతుంది.
బాణసంచా ధరలు ఇలా..
దీపావళిలో ఎక్కువగా పిల్లలు ఇష్టపడి కాల్చే కాకరపువ్వొత్తులు సాదా బాక్స్ ధర మంచి కంపెనీ అయితే రూ.90 నుంచి రూ.110 ఉంది. గతేడాది రూ.60 నుంచి 70 ఉండేది. చిచ్చుబుడ్డులు చిన్నవి పది ఉండే బాక్స్ రూ.60 నుంచి 80 ఉంది. గతేడాది రూ.40 నుంచి 60 మధ్య ఉండేది. పెద్దవి అయితే మంచి కంపెనీ రూ.300 వరకు పలుకుతోంది. తాళ్లు చిన్న పెట్టె రూ.40, పెద్దవి రూ.80, సీమటపాసులు చిన్న బాక్స్ రూ.50 పలుకుతోంది. భూ చక్రాలు గతేడాది రూ.70 నుంచి రూ.80 ఉండేది. ఇప్పుడు రూ.100 నుంచి రూ.120 దాకా ఉంది. 5000 వాలా బాంబు దండ గతంలో రూ.1200 నుంచి రూ.1300 ఉండేది. ఇప్పుడది రూ.1500 నుంచి రూ 1800 పలుకుతోంది. థౌజండ్‌వాలా మంచి రకం గతంలో రూ.2 వేలు ఉండేది. ఇప్పుడు రూ.2500 ఉంది. ఇందులో సాదా రకం రూ.1800 ఉంది. ఇలా అన్ని రకాల ధరలూ 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి.
ఏది కొందామన్నా రూ.100 పైనే
గతేడాదితో పొలిస్తే అన్ని ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. ఏది కొందామన్న రూ.100పైనే ఉంది. రూ.1000 తీసుకెళ్లితే చిన్న క్యారీ బ్యాగ్ కూడా నిండడం లేదు. దుకాణాలకు వెళ్లితే ధరలు చూసి చెమటలు పడుతున్నాయి. అగ్గిపెట్టె నుంచి థౌజండ్ వాలా వరకు అన్ని ధరలు పేలుతున్నాయి. ల్యాబర్, ట్రాన్స్‌పోర్టు, పన్నులు, దుకాణ అద్దెలు, కెమికల్స్ ధరల పెరుగుదల టపాసులపై పడిందని, ఆందుకే ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్పుతున్నారు.
అందుబాటులో లేని ధరలు
దీపావళి అంటేనే అనందాల సందడి.. ఇంటిల్లిపాదీ కలిసి జరుపుకునే పండగ.. కానీ నేడు అలాంటి పండగ సామాన్య ప్రజలకు గుదిబండగా మారుతోంది. బాణసంచా కొనాలంటేనే గుండె గుబేలు మంటోంది. హోల్‌సేల్ అంటూ రిటైల్ ముసుగులు వ్యాపారులు దోచుకుంటు న్నారు. అందరూ సిండికేట్ అయిపోయి గత నెలరోజులుగా ధరలను అమాంతంగా పెంచేశారు. బాణసంచా ప్యాకింగ్‌లపై ఉన్న ధరకు, వాస్తవ ధరకు 200 రెట్లు వ్యతాసం ఉంటుంది. కానీ వ్యాపారులు ఎంఆర్‌పి ధరలకు లేదంటే దానికి పదిశాతం తగ్గించి విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఉదాహరణకు అయాన్ చిచ్చుబుడ్డిల ధర రూ.650 ఉండగా, 500 వరకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి వీటి ధర రూ.200 లోపే ఉంటుంది. కానీ వ్యాపారులు ఎంఆర్‌పి ముసుగులో జనాలను దోపిడీ చేస్తున్నారు.