అనంతపురం ప్రతినిధి : టపాసులకు నిప్పుపెట్టకనే ధరల మంటతో పేలుతున్నాయి. అసలు వాటి ధరలు తెలిపే సూచనలేవి లేకుండా విక్రయశాలలకు చేరాయి. బాహాటంగానే నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు జోరుగా సాగడం మొదలైంది. అనంతపురం జిల్లాలో 220 టపాసుల విక్రయశాలలకు అనుమతులిచ్చారు. ఇందులో అనంతపురం నగరంలోనే 103 దుకాణాలకు అనుమతులిచ్చారు. వీటిని శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేశారు. సత్యసాయి జిల్లాలోనూ ఇదే రకంగా ఏర్పాట్లు జరిగాయి. అక్కడ కూడా ఇదే తంతు నడిచినట్టు ఆరోపణలున్నాయి.
ఎంఆర్‌పి లేకుండా అమ్మకాలు
ఏ వస్తువు అయినా అమ్మకాలు జరపాలంటే విధిగా అమ్మకపు ధర ఆ ప్యాకెట్‌పై ఉండాలి. అదే విధంగా ఎక్కడ తయారయిందన్న చిరునామా విధింగా ఉండాలి. వినియోగదారుడు ఫిర్యాదు చేయడానికి మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి విధిగా ఉండాలి. ఇవేవి లేకుండానే టపాసుల విక్రయాలు సాగుతున్నాయి. సాక్షాత్తు తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీల్లోనే ఇవి వెల్లడయ్యాయి. ఇంత జరుగుతున్నా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాల్లేవు. తూనికల శాఖ అధికారులు మాత్రం కొన్ని షాపులను పరిశీలించి రూ.15 వేలు జరిమానా విధించారు.
జీఎస్టీ లేకుండా అమ్మకాలు
ఏ వస్తువులు అమ్మాలన్న విధంగా బిల్లు ఉండాలి. దానికి జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క విక్రయ కేంద్రంలోనూ బిల్లులు విధిగా వేసిన దాఖలాలేవు. ఎటువటి నిర్ణత ధరలు లేకుండా అమ్ముతున్నా ఆ శాఖ అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాల్లేవు. ఎంఆర్‌పిపైనే జీఎస్టీని వసూలు చేయాల్సి ఉంటుంది. అసలు ఎంఆర్‌పిలే లేకుండా విక్రయాలు సాగుతున్నప్పుడు జీఎస్టీ ప్రస్తావనే లేకుండా సాగాయి.
అనుమతుల్లోనూ తేడాలు
టపాసుల విక్రయాలకు అనుమతులు తీసుకున్న వాటిల్లోనే ఒక్కో శాఖ వద్ద ఒక్కో రకమైన సంఖ్యలు కనిపించడం గమనార్హం. ఉదాహరణకు సత్యసాయి జిల్లా కదిరిలో చూసినప్పుడు పురపాలక సంఘం వద్ద తీసుకున్న అనుమతులు 29షాపులకున్నాయి. అదే అగ్నిమాపక శాఖ వద్ద తీసుకున్న అనుమతులు 31 ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే 35 షాపులున్నాయి. ఈ రకంగా అనుమతులు తీసుకున్న వాటికి ఏర్పాటు చేసిన వాటికి మధ్య భారీ తేడాలే ఉన్నాయి. అనుమతి తీసుకున్న వరకైనా నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారా అంటే అదీ లేదు. 10-15 అడుగుల విస్తీర్ణంలో ఒక్కో షాపు ఏర్పాటు చేస్తామని అనుమతి పొందారు. కాని పెట్టిన దుకాణాలు చూస్తే 20-30 అడుగులు కూడా ఉండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా అదికారులు ఎటువంటి చర్యలూ తీసుకున్న దాఖలాల్లేవు. అధికారులు గిప్టు బాక్సులతో సైలెంట్ అయిపోయారన్న ఆరోపణలున్నాయి. ధరలపైనా ఏ మాత్రం నియంత్రణ లేకపోవడంతో సామాన్యుడు కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది.