
'నీకేమైనా పిచ్చా? మతుండే మాట్లాడుతున్నావా? అభిమానానికైనా అర్థముండాలి. ఇప్పుడు నువ్వా పనిచేస్తే ఇన్నాళ్లు మీనాన్నపై ఊరివాళ్లు వేసిన నింద నిజం చేస్తావా? అది నీకు అర్థమవుతోందా?' పెద్దయ్య మండిపడ్డాడు.
'అమ్మకు తలకొరివి పెట్టడం కొడుకు బాధ్యత కాదా పెద్దయ్యా?'.
'ఎవర్రా నీకు అమ్మా? నిన్ను కడుపున మోసిందా, పేగు తెంచిందా, పాలు పట్టిందా? తల్లిలేని వాడివని చేరదీసినంత మాత్రాన అమ్మయిపోతుందా? మనమధ్య ఓ సామాజిక అంతరం ఉందన్న విషయం మర్చిపోతున్నావా?'.
'మానవత్వానికి మించిన సామాజిక ఏకత్వం ఏముంటుంది పెద్దయ్యా?'.
'ఈ మాట వినడానికి బాగానే ఉంటుందిరా! జనాన్ని ఎలా ఒప్పించగలం. అవునంటే నీతోపాటు నన్నూ తప్పుపడతారు. ఏం చెయ్యాలి?' కోపంగా అన్నాడు పెద్దయ్య వెంకన్న.
'నా తృప్తికోసం నేనిది కోరుతున్నాను. ఎవరి మెప్పుకోసమో, నీకు ఎదురుచెప్పాలనో కాదు. నీ ఎనభై ఏళ్ల వయసులో ఎన్నో క్లిష్ట సమయాల్లో పరిణతితో వ్యవహరించావు. ఇప్పుడీ నిర్ణయం నీకు పెద్దకష్టం కాదు' అని వేడుకున్నాను.
కోపంతో విదిలించుకున్నాడు పెద్దయ్య.
'కాసేపు ప్రశాంతంగా ఆలోచించు. తర్వాత మాట్లాడుదాం' అంటూ విసురుగా ఫోను పెట్టేశా. పెద్దయ్య.
నేను ఆలోచనల్లోకి జారుకున్నాను.
'ఏమయ్యిందండీ? ఎవరు?'
ఫోన్‌లో మాట్లాడుతున్న నా ముఖంలో మార్పులు గమనించి, ప్రశ్నించింది నా భార్య వర్థనం.
'గౌరమ్మ చనిపోయిందట!' ఆవేదనతో చెప్పాను.
'అయ్యో..ఈ మధ్యన కోలుకుందన్నారుగా. ఇంతలోనే ఏమయ్యింది?'.
'నిన్న అర్ధరాత్రి సుస్తీ చేసిందట. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. సరేలే నేను సూరితో మాట్లాడి, ఏర్పాట్లు చూడమని చెబుతాను. నువ్వు ప్రయాణ ఏర్పాట్లు చూడు' అంటూ భార్యతో చెప్తూ ఫోన్ పట్టుకుని బయటకు వచ్చేశాను.
సెలవు, విమాన టిక్కెట్ల ఏర్పాటు చేసుకుని, సూరికి ఫోన్ చేశాను.
'అన్నయ్యా, చెప్పు!' అటు నుంచి సూరి.
'నేను వచ్చే వరకూ శవం ఉంచండి. సాయంత్రం అంతిమ సంస్కారానికి అవసరమైన ఏర్పాట్లు చెయ్యి. గౌరమ్మ మేనల్లుడు ఉన్నాడు కదా! అవసరమైన డబ్బులు శెట్టి దగ్గర తీసుకో. మధ్యాహ్నానికల్లా నేను అక్కడ ఉంటాను. అనుకోని కారణాల వల్ల రాలేకపోతే మరునాడు కార్యక్రమం జరిగేలా చూడు. శవాన్ని ఉంచమన్నానని పెద్దయ్యకు నా మాటగా చెప్పు' సూరికి అన్ని విషయాలూ వివరంగా చెప్పి, ఫోన్ పెట్టేశాను.
ఇంతలో ట్రావెల్ ఏజెంట్ ఫోన్ చేసి, పదకొండు గంటలకు ఫ్లైట్ అని చెప్పాడు. ఎలా చూసుకున్నా మూడు, నాలుగు గంటల మధ్య ఊరుకి చేరిపోతానని అనుకున్నాను.
***
మొదటి నుంచి గౌరమ్మ విషయంలో నేను ఎక్కువ చేస్తున్నానన్నది మా ఊరివాళ్ల అభిప్రాయం. నేను వచ్చే వరకూ శవాన్ని ఉంచమన్నానని తెలిసి, కచ్చితంగా ఆడిపోసుకుంటారు. వారి దృష్టిలో ఆవిడ ఓ పనిమనిషి. నా దృష్టిలో అమ్మ.
గౌరమ్మ విషయంలో నన్ను అర్థం చేసుకున్నది నా భార్య మాత్రమే. ఎందుకూ అంటే.. తనకీ కారణం తెలియదు. ఓ పనిమనిషి, అదీ సామాజిక అంతరం ఉన్న మనిషికి అంత ప్రాధాన్యం ఇస్తున్నానంటే ఏదో బలమైన కారణం ఉందన్నది ఆమె నమ్మకం.
గౌరమ్మ వయసు ఎనభై ఏళ్లు పైనే ఉంటాయి.
మా తాతతండ్రుల నుంచి ఆ కుటుంబం సేవలు మాకే పరిమితం. యాభై ఎకరాల భూస్వామి తాతయ్య. మగవారు కంబారులు, ఆడవాళ్లు పాలికత్తెలు. ఇదో వెట్టిచాకిరీ, కానీ అప్పట్లో అలా బుగతోరు (యజమాని) ఉన్న వాళ్లకు ఊరిలో గుర్తింపు ఉండేది. పనివాళ్లకు అదో రక్షణ. యజమాని కుటుంబంలో వారూ భాగం. వారి మంచిచెడ్డలు బాధ్యత బుగతోరిదే.
నా మూడేళ్ల వయసులోనే అమ్మ చనిపోయింది. అసలు అమ్మ రూపం ఎలా వుంటుందో కూడా నాకు తెలియదు. అమ్మంటే నాకు గౌరమ్మ ముఖమే గుర్తుకు వస్తుంది.
ఏడాది తిరిగేలోపే నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అమ్మ చనిపోయాక నేను ఒంటరి అయ్యాను. నాన్న నేనున్నాననే మర్చిపోయారు. పిన్ని నన్నెప్పుడూ బిడ్డగా చూడలేదు.
పైగా ఆమె రాక్షసత్వానికి నా చిన్ని గుండె విలవిల్లాడిన సందర్భాలు ఎన్నో.
ఓ రోజు ఉదయాన్నే నాన్న, నానమ్మా, తాతయ్యా పొలానికి వెళ్లిపోయారు. పిన్ని ఎప్పుడూ పొలానికి వెళ్లడం నాకు తెలియదు. ఆకలితో ఏడుస్తున్నాను. నా పట్ల జాలి కూడా చూపని పిన్ని చెంపపై రెండుసార్లు కొట్టింది. అయినా నేను ఏడుపు ఆపకపోయేసరికి విసిగిపోయింది. నా కాళ్లు, చేతులు కట్టేసి వంటపాక, పెంకుటింటికి మధ్యలో ఉన్న వరండాపై పడేసింది. ఆ తర్వాత పెరటి తలుపు వేసుకుని ఏటి(నది)కి స్నానానికి వెళ్లిపోయింది. పంజరంలో చిక్కుకున్న చిలకలా నేను ఏడుస్తున్నాను.
భయంతో స్పృహతప్పి పడిపోయాను. భయం వల్ల నంబర్ టూ కూడా అక్కడే వెళ్లేశాను. స్పృహతప్పి పడిపోయాక దానిమీదే దొర్లేశాను. దీంతో ఆ ప్రాంతం అంతా పాడైపోయి, అసహ్యంగా తయారయ్యింది.
స్నానం చేసి వచ్చిన పిన్ని నన్నుచూసి జాలిపడలేదు. నా ఒంటికి అంటుకున్న అశుద్ధం కంటే వరండా పాడు చేశానన్న కోపమే ఆమెలో కనిపించింది. కర్ర తీసుకుని, ఇష్టానుసారం కొట్టింది. ఆ తర్వాత పెరటి తలుపు తీసింది. కనీసం నన్ను ముట్టుకోకుండా కర్రతోనే బయటకు నెట్టేసింది.
ఓ గంట తర్వాత పెరట్లోకి వచ్చిన గౌరమ్మ నన్ను చూసి, కన్నీరు పెట్టుకుంది. స్నానం చేయించింది. తాతయ్యా, నానమ్మ వచ్చాక ఉతికిన బట్టలు తీసుకుని, వేసింది.
నన్ను కొట్టినందుకు నానమ్మా, తాతయ్యా తిడితే 'ఇల్లు పాడుచేస్తే కొట్టకుండా ఉండాలా?' అంటూ పిన్ని సమర్ధించుకుంది.
నాలుగేళ్ల వయసులో జరిగిన ఈ ఘటన నా కళ్ల ముందు ఇప్పటికీ కదలాడుతుంది.
ఆరేళ్ల వయసులో మరో మర్చిపోలేని అనుభవం. మధ్యాహ్నం ఆకలితో ఏడుస్తున్నాను. ఇంట్లో పిన్ని తప్ప ఎవరూ లేరు. వంట చేస్తున్న పిన్ని నన్ను చూసి విసుక్కుంటోంది. నా ఏడుపుకు కారణం ఆమె అర్థం చేసుకోలేదు. కనీసం పట్టించుకోలేదు. నా ఏడుపు ఆమెకు వినోదం. నా ఆవేదన ఆమెకు సంతోషం. అది నా దురదృష్టం.
కాసేపటికి ఏదో పనిమీద పెరట్లోకి వెళ్లింది. ఏడుస్తున్న నేను వంటపాకలోకి వెళ్లాను. వండి వార్చిన అన్నం చూడగానే నా కళ్లు మెరిశాయి. కుండలో చెయ్యిపెట్టి ఇంతముద్ద నోట్లో పెట్టుకున్నాను. అలా మూడునాలుగు సార్లు చేశాను. కొంత అన్నం కింద కూడా పడింది. ఈలోగా పెరట్లోకి వెళ్లిన పిన్ని వచ్చింది. నన్ను చూసి కోపంతో ఊగిపోయింది. ఇష్టానుసారం కొట్టింది. అయినా ఆమె కోపం తీరలేదు.
'ఇందులో చెయ్యిపెట్టలేకపోయావా, ఆకలి ఇంకా తీరేది' అంటూ కట్టెల పొయ్యిపై మరుగుతున్న చారులో నా చెయ్యి ముంచింది.
వేడికి కాలిపోయిన నా చేతిని చూస్తూ దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చాను. 'అమ్మా...అమ్మా..!' అంటూ బాధతో విలవిల్లాడాను. పిన్ని తప్ప నా ఏడుపు వినేవారెవరూ లేరు అక్కడ. బాధతో విలవిల్లాడిపోతున్న నన్ను చూసి ఆమె జాలిపడలేదు. పైగా పొలం నుంచి వచ్చిన నానమ్మ, తాతయ్యలకు ఓ అందమైన అబద్ధం చెప్పి, తన తప్పును కప్పిపుచ్చుకుంది.
గౌరమ్మే తోటలోకి వెళ్లి, ఏవో ఆకులు తెచ్చి చేతికి పసరు పూసింది. నెలరోజులపాటు ఆ చేతితో ఏ పనీ చేయలేకపోయాను. తిండి కూడా గౌరమ్మే పెట్టేది. ఆ సందర్భంలో ఆమె కంటనీరు నేను గమనించేవాడిని. అమ్మే గుర్తుకు వచ్చేది. ఆ ఘటన తర్వాత నానమ్మ నన్నెప్పుడూ ఇంట్లో ఒంటరిగా వదల్లేదు.
అయినా పిన్ని వికృత చేష్టలకు బలైన సందర్భాలు ఎన్నో. ఏడ్చి ఏడ్చి నా చిన్నిగుండె అలసిపోయేది. రాత్రయితే నానమ్మే ఓదార్పు. పగలు గౌరమ్మే నాకు దిక్కు.
గౌరమ్మకు పద్నాలుగేళ్లకే పెళ్లయ్యిందట. ఓ కూతురు పుట్టాక ఆమె భర్త వదిలేసి, ఎటో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి గౌరమ్మకు మా ఇల్లే సర్వస్వం. తన కూతురితోపాటు నన్నూ కొడుకులా చూసుకునేది.
తెల్లవారు జామున పశువుల పాక ఊడ్చడంతో ఆమె దినచర్య ప్రారంభమయ్యేది. రాత్రి ఏ మలిజాముకో ముగిసేది. స్నానం చేయించడం నుంచి నా ఆలనాపాలనా అంతా గౌరమ్మే చూసేది. నానమ్మ, తాతయ్యల నోట్లో నాలుకలా ఉండేది. గౌరమ్మంటే అమ్మకు ప్రాణమట. నానమ్మే చెప్పింది. ఊరివాళ్లు కూడా గౌరమ్మను ఎంతో అభిమానించేవారు.
'కష్టపడి పనిచేస్తుంది. మాయామర్మం లేని మనిషి' అని పదేపదే అనడం వినేవాడిని. ఆ మాటలు విన్నప్పుడు నా మనసు ఎంతో సంతోషించేది.
అమ్మ ఎంతలా గౌరమ్మను అభిమానించేదో, పిన్ని అంత దూరం పెట్టేది. ఆమెను ఇంట్లోకి కూడా రానిచ్చేది కాదు. నాన్నతో మాట్లాడితే మండిపడిపోయేది. అలా పిన్ని ఎందుకు చేస్తుందో నాకు అర్థమయ్యేది కాదు.
నాకు పదేళ్ల వయసు వచ్చేసరికి నానమ్మా, తాతయ్య చనిపోయారు. నేను ఒంటరివాడినయ్యాను. దీంతో అన్నింటికీ నాకు గౌరమ్మే దిక్కయ్యింది. ఉదయం దినచర్యల నుంచి రాత్రి భోజనం అయ్యే వరకూ ఆమెదే బాధ్యత. ఆ అభిమానంతోనే ఓసారి దేనిగురించో అడిగితే ''గౌరీ అమ్మకు ఇచ్చాను'' అని పిన్నితో అన్నా. నా చెంప చెళ్లుమంది. మరోసారి ''అమ్మా'' అన్నావంటే తోలుతీస్తా అంది. ఎప్పుడూ నన్ను పట్టించుకోని పిన్నికి నేను ఆ మాటంటే అంత కోపం ఎందుకు వచ్చిందో అర్థంకాలేదు. అప్పుడే వచ్చిన నాన్నకు కూడా నాలుగు చాడీలు చెప్పడంతో ఆయనా నన్ను మరో రెండు దెబ్బలేశారు.
ఏడుస్తూ పెరట్లోకి వెళ్లిన నన్ను గౌరమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుని, మురిపెంగా విషయం అడిగింది.
'మీరు పెద్దోళ్లు బాబు. నేను పాలికత్తెను. నన్ను అమ్మా అనకూడదు. కావాలంటే ''ఏరు గౌరీ'' అని అథారిటీగా పిలవమంది. కానీ నా మనసు అందుకు అంగీకరించేది కాదు.
'ఓ బిడ్డకు తల్లిచేసే సపర్యలన్నీ ఆమెతో చేయించుకునేవారు. అప్పుడు లేని నామోషీ ఆమెను ''అమ్మా'' అని పిలిస్తే ఎందుకు వచ్చింది? అర్థం చేసుకునే వయసు నాది కాదు.
నేను పెద్దవాడినయ్యాను. ఊర్లో చదువు పూర్తయ్యింది. మా ఊరికి పాతిక కిలోమీటర్ల దూరంలోని కాలేజీలో నాన్న చేర్పించారు. అక్కడి హాస్టల్‌లో నా మకాం. అలా మొదటిసారి గౌరమ్మతో నాకు దూరం మొదలయ్యింది. సెలవులకు ఊరెళ్లినప్పుడు మాత్రమే గౌరమ్మను చూడగలిగేవాడిని.
పిన్నికి ఇద్దరు కూతుర్లు. నా కంటే పదేళ్లు చిన్న. కానీ నాతో సన్నిహితంగా ఉండేవారు కాదు. ''అన్నయ్యా'' అని ఆప్యాయంగా పిలిచేవారు కాదు. సెలవులకు ఇంటికి వస్తే శత్రువును చూసినట్టు చూసేవారు. ఊర్లో ఉన్నప్పుడు గౌరమ్మ కూతురితోనే ఆడుకునేవాడిని. ఓసారి పెరట్లో ఆడుకుంటూ ఉంటే గౌరమ్మ కూతురు నన్ను ''అన్నయ్యా'' అని పిలిచింది. ఆ మాట విన్న పిన్ని అంతెత్తున లేచింది.
'ఎవడే నీకు అన్నయ్య? మరోసారి అలా పిలిచావంటే చర్మం వలిచేస్తాను. ''బాబూ!'' అని పిలువ్!' అని హూంకరించింది.
'వీడు ఇంట్లో ఉన్నప్పుడు దీన్నెప్పుడూ ఈ ఇంటివైపు తేకు. తెచ్చావంటే నీ వీపు విమానం మోత మోగుద్ది' అని గౌరమ్మను కూడా పిన్ని హెచ్చరించింది.
ఇంట్లో పిన్ని పెత్తనం పెరిగాక నాన్న నోరు మూతపడిపోయింది. ఆయన వ్యాపకాలు ఆయనవి. వయసు పెరుగుతున్న కొద్దీ నేను మరింత ఒంటరివాడినయ్యాను. చిన్నప్పుడు గౌరమ్మ కూతురితోనైనా ఆడుకునేవాడిని. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. గౌరమ్మతో కూడా దూరం పెరుగుతూ వచ్చింది. ఆమె అభిమానం మాత్రం అలాగే ఉండేది.
సెలవులకు నేను ఇంటికి వస్తే తన కొడుకే వచ్చినంత ఆనందించేది. చదువు పూర్తయ్యాక బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యాను. దూరప్రాంతంలో కొలువు. ఊరుదాటి వెళ్లిపోవడంతో గౌరమ్మకు మరింత దూరమయ్యాను.
***
బంధాలు, అనుబంధాలు ఎలా వున్నా కాలచక్రం ఆగనిది. గౌరమ్మ తన కూతురికి పెళ్లిచేసి, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంది. పెళ్లి ఖర్చంతా నేనే సమకూర్చాను. పిన్నికి భయపడి వద్దంది.
''రుణం తీర్చుకోనీ అమ్మా!'' అంటూ బతిమిలాడితే తీసుకుంది.
గౌరమ్మ మంచిచెడ్డలు చూడాల్సిన బాధ్యత ఎప్పటికీ నాపై ఉందనుకున్నాను. అందుకే నా చెల్లెళ్లతోపాటు గౌరమ్మ కుమార్తెనూ ఓ చెల్లిగా భావించేవాడిని. ప్రతి సందర్భంలోనూ చొరవ తీసుకుని, సాయం చేసేవాడిని.
వారి అవసరాలు చిన్నచిన్నవే. నా ఆస్తి, ఆదాయంతో పోల్చుకుంటే అవేవీ నాకు పెద్ద భారం కాదు. ''రుణానుబంధం'' అని మాత్రం అనుకునేవాడిని.
కానీ పిన్నికే మంటగా ఉండేది. నాన్నకు చాడీలు చెప్పేది. ఏ విషయంలోనూ పిన్నికి ఎదురుచెప్పలేని నాన్న నేను ఉద్యోగస్తుడిని అయ్యాక నన్ను కూడా అడిగే ధైర్యం చేయలేకపోయేవారు. అది ఆయన బలహీనత. అమ్మ బతికి ఉండగా పులిలా బతికారు. పిన్ని వచ్చాక పిల్లిలా మారిపోయారు. ఆస్తి ఆయనదే కానీ పెద్దరికం, పెత్తనం అంతా పిన్నిదే.
ఉద్యోగం వచ్చిన మూడేళ్లకే నాన్న పెళ్లి చేసేశారు. మా ఊరికి దగ్గరలో మాకు తెలిసిన వారి అమ్మాయే వర్థనం. నేను ఇద్దరి బిడ్డల తండ్రినయ్యాను. వార్థక్యంతో గౌరమ్మ ఇంటికే పరిమితమయ్యింది. ఆ స్థానాన్ని గౌరమ్మ కూతురు, అల్లుడు భర్తీ చేశారు. కానీ పిన్నిని ఎక్కువ రోజులు భరించలేకపోయారు. ఆమె వేధింపులు తట్టుకోలేక పనికి రాంరాం చెప్పేసి పట్నం వెళ్లిపోయారు.
'వెళ్లేముందు గౌరమ్మను తీసుకువెళ్లే ప్రయత్నం చేశారట. బుగతోరిని వదిలి రానందట!' చేసేదిలేక వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లు తిరిగి రాలేదు. ప్రమాదంలో కన్నుమూశారు. కూతురు, అల్లుడు మృతితో గౌరమ్మ జీవచ్ఛవం అయిపోయింది. ఆమెకు లోకమే చీకటయ్యింది. చాలా రోజులు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయింది.
రెండేళ్ల వ్యవధిలో నాన్నా, పిన్నీ ఇద్దరూ కన్నుమూశారు. చెల్లెళ్లు ఆస్తి తగాదా పెట్టారు. అమ్మకు, పిన్నికి చెరో సగం వాటా చెప్పారు పెద్ద మనుషులు. నా ఆస్తి బాధ్యతలు మామగారికి అప్పగించేశాను.
ఇక నాకు మిగిలిన ఏకైక బాధ్యత గౌరమ్మ. వార్థక్యంలో ఆమెకు నా సాయం తప్పనిసరి. అందుకే ఎక్కడో ఉన్న ఆమె మేనల్లుడి కుటుంబాన్ని తెచ్చి ఆమెకు తోడుగా పెట్టాను. వారికి ఓ రెండెకరాలు భూమి ఇచ్చాను. నా పొలంలో పనిచేసుకుంటూ, ఆ రెండెకరాలు సాగు చేసుకుంటూ గౌరమ్మను జాగ్రత్తగా చూసుకోమన్నాను. వారు నియమం తప్పలేదు. నెలనెలా కొంత డబ్బు పంపేవాడిని. ఓ తల్లిపట్ల బిడ్డ చూపించే మమకారం, బాధ్యత నాది.
నా ఆత్మగతం తెలియని ఊరి జనం మాత్రం తండ్రి బాధ్యత కొడుకు నెరవేరుస్తున్నాడంటూ గుసగుసలాడుకునేవారు. మా నాన్నకు, గౌరమ్మకు సంబంధం ఉందని వెకిలిగా మాట్లాడేవారు. గౌరమ్మ కూతురు నాన్నకు పుట్టిందే అని ఎద్దేవా చేసేవారు.
నాన్న గురించి నాకు తెలుసు. ఆయన నన్ను పట్టించుకోకపోతే పోవచ్చు. కానీ గుణం లేని మనిషి కాదు. పైగా పెద్దరికం చట్రంలో బతికినవాడు. అందుకే ఊరి జనం మాటలు పట్టించుకునేవాడిని కాదు.
గౌరమ్మ విషయంలో నా చర్యలు అతిగా భావించినవారున్నారు. వారి దృష్టిలో గౌరమ్మ ఓ పనిమనిషి మాత్రమే. కానీ నా దృష్టిలో అమ్మ. నాపట్ల గౌరమ్మ కురిపించిన ప్రేమాభిమానాలు వారికి ఎలా అర్థమవుతాయి? అది వారి తప్పుకాదు. వారి స్థానంలో నేనున్నా అలాగే ఆలోచించేవాడినేమో.
***
విశాఖలో విమానం ల్యాండ్ అయ్యేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయ్యింది. అనుకున్న సమయానికే చేరుకోవడంతో నా మనసు తేలికపడింది. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ట్యాక్సీలో నాలుగు గంటలకల్లా ఊరికి చేరుకున్నాం. సూరి ఏర్పాట్లన్నీ పూర్తిచేసి ఎదురుచూస్తున్నాడు. కారు దిగగానే నేరుగా పెద్దయ్య వద్దకు వెళ్లాను. ఆయన ఊరిపెద్దే కాదు, మా కుటుంబానికీ పెద్ద. దూర దృష్టి ఉన్న మనిషి. కానీ నేను విషయం చెప్పగానే షాక్ అయ్యాడు. కంగారుపడ్డాడు. విసురుగా లోపలికి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత బయటకు వచ్చాడు. 'శవం ఉంచమన్నావంటే చివరి చూపు కోసం అనుకుని సరే అన్నాను. నీకు ఫోనులో అంత వివరంగా చెప్పినా అర్థం కాలేదా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'అయినింటి బిడ్డను. కానీ అనాథలా పెరిగాను. అమ్మ ముద్దూముచ్చటా లేదు. నాన్న ఆప్యాయతా దొరకలేదు. ఆకలితో ఏడుస్తున్నా, బాధతో విలవిల్లాడుతున్నా చిన్నపిల్లాడినన్న దయ చూపించినవారు లేరు. అటువంటి నన్ను పనిమనిషి అయితేనేం తన చేతుల్లోకి తీసుకుని, అల్లారుముద్దుగా పెంచింది గౌరమ్మ. ఇది నిజం కాదా పెద్దయ్యా? నీకు నేను చెప్పాలా?'.
'అది నిజమేరా! అభిమానించడం వేరు. అందుకు ఏ రూపంలో సాయం చేసినా అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు ఏకంగా తలకొరివి పెడతానంటే ఊరిపెద్దగా ఇక్కడి వారికి నేనేం చెప్పాలి?'.
'ఊరి సంగతి నాకు తెలుసు పెద్దయ్యా. ఏడాదికోసారి వచ్చేవాడిని. వారం, పది రోజులుండి వెళ్లిపోయే వాడిని. నా విషయంలో అంతగా ఆలోచించడం అవసరం అంటావా?'.
'ఏడాదికోసారి వచ్చేవాడివైనంత మాత్రాన ఈ ఊరివాడివి కాకుండాపోతావా? ఇక్కడి ఆస్తిపాస్తులన్నీ వదిలేస్తావా? రేపు రిటైరయ్యాక ఇక్కడికి కాకపోతే ఎక్కడికి వెళ్తావు? అవేం మాటలురా?!'.
'పెద్దయ్యా నీతో వాదించాలని కాదు. నువ్వు అనుమతిస్తే చాలు నాకు. ఊరి జనంతో పనిలేదు. అభ్యంతరం ఉంటే నా వ్యక్తిగత ఇష్టమని చెప్పు' అంటూ చేతులు జోడించాను.
పెద్దయ్య నా మాట కాదనలేకపోయాడు. సరే అనడంతో నా మనసు ఉప్పొంగిపోయింది. నా నిర్ణయాన్ని అభినందించిన వారున్నారు, విమర్శించిన వారున్నారు.
ఊరి జనం అభిప్రాయంతో నాకు పనిలేదు. ఇప్పుడు తప్పుపట్టిన వారే రేపు శభాష్ అనొచ్చు. అమ్మ రుణం తీర్చుకోవడం నా బాధ్యత. ఈ ఆలోచన రాగానే నాకు ధైర్యం వచ్చింది.
గౌరమ్మ అంతిమ సంస్కారాల్ని పూర్తిచేశాను. మళ్లీ జన్మంటూ ఉంటే, ఆమెకే పుట్టాలని కోరుకున్నాను.
'కన్నతల్లినే పట్టించుకోని ఈ రోజుల్లో నిన్ను పెంచి పెద్ద చేసిందన్న మమకారంతో పనిమనిషికి కూడా తల్లి స్థానం ఇచ్చి గౌరవించావు. నీది గొప్ప మనసు బాబు. పది కాలాలు చల్లగా ఉండు!' ఓ పెద్దావిడ దీవిస్తోంది. మరికొందరి నోటి నుంచి అటువంటి ప్రశంసలే వినిపించాయి.'నా పని మెచ్చే అన్నారో, నా మెప్పుకోసం అన్నారో కానీ, మా అమ్మ రుణం తీర్చుకోగలిగాను. ఇది నా జీవిత చరమాంకం వరకూ మిగిలే సంతోషం!' అనుకుని, ఆత్మసంతృప్తితో వెనుదిరిగాను.
బివి రమణమూర్తి 8985527613