Oct 17,2021 11:08

    సంపద ఒకచోటే పోగుబడిన ప్రస్తుత దశలో సగటు జీవికి ఆకలి - పేదరికం అడుగడుగునా ఆటంకంగా మారాయి.. మానవాళిని పేదరికం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రపంచ దేశాలు సుదీర్ఘకాలంగా చెప్తూనే ఉన్నాయి. సంపద పెరగడమే పేదరికానికి పరిష్కారం అని చెబుతున్నా.. వాస్తవానికి పేదరికం అంతకంతకూ పెరగడం చూస్తే ఆ వాదన ఎంత బూటకమో స్పష్టమవుతోంది. అత్యధిక దేశాలు అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాల ఫలితంగా నేటికీి కోట్లాది మంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. పేదరికాన్ని 2030 నాటికి పేదరికాన్ని అంతం చేయాలని ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్నప్పటికీ, ఆ దిశగా ఆయా దేశాలు ఎందుకు లక్ష్యాలను అధిగమించలేకపోతున్నాయి? లోపం ఎక్కడుంది? అసలు పేదరిక నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలేంటి? మాటల్లో చెబుతున్న అభివృద్ధి.. ఆచరణలో ఎందుకు సాధ్యం కావడం లేదు? దేశంలో ఆహారధాన్యాల నిల్వలు రికార్డు స్థాయిలో పెరిగాయని ఓ వైపు ప్రభుత్వం చెప్తోంది. కానీ అంతకన్నా ఎక్కువస్థాయిలో ఆకలి పెరిగిందనేది అంతే వాస్తవం. ఇలా ఎందుకు జరుగుతోంది? ఒకప్పుడు తీవ్ర పేదరికంలో ఉన్న చైనా తన లక్ష్యాలను ఎలా చేరుకోగలిగింది? వారు అనుసరించిన విధానాలు ఏంటి? ఆర్థిక సంక్షోభాల సమయంలో కరోనా ఎలాంటి ప్రభావం చూపింది? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15.5 కోట్ల మంది తీవ్రమైన ఆకలి సమస్యల్లో చిక్కుకున్నారని ఆక్స్‌ ఫామ్‌ నివేదిక వెల్లడించింది. ప్రతి నిమిషానికి 11 ఆకలి చావులు నమోదవుతున్నాయనే నివేదిక సారాంశమే దీని తీవ్రతకు నిదర్శనం. అక్టోబర్‌ 17 'అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం' నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం..

    ప్రపంచవ్యాప్తంగా పేదరికం బహుముఖాలుగా విస్తరిస్తోంది. ఆదాయపరంగా అసమానతలు పెరిగిపోతున్నాయి. సామాజికంగా అట్టడుగు వర్గాలకు ఎదురవుతున్న సవాళ్లూ తీవ్రమవుతున్నాయి. అసలే సరళీకరణ ఆర్థిక విధానాల అనుసరణతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రపంచానికి కరోనా తోడైంది. అనేకమంది ఉపాధి లేమి, జనాభా వృద్ధి స్థాయిని మించి, ఆకలి సమస్య పెరిగిపోయింది. ఇటీవల విడుదల చేసిన ఐక్యరాజ్యసమితి నివేదిక దీన్ని స్పష్టం చేసింది. ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మందికి పోషకాహారలోపం ఉండొచ్చని అంచనా. కోవిడ్‌కు ముందే ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందనే విషయం తెలిసిందే. 2021 నాటికి ప్రపంచంలో 15 కోట్ల మంది తీవ్ర పేదరికానికి గురయ్యే అవకాశముందని ప్రపంచబ్యాంకు హెచ్చరించింది. కొత్త వ్యాపారాలు, రంగాల్లో శ్రమ, నైపుణ్యాలు, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించాలనీ.. కోవిడ్‌ తర్వాత 'విభిన్నమైన ఆర్థిక వ్యవస్థ' కోసం దేశాలు సిద్ధం కావాలనీ అది కోరింది. కరోనా మహిళలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం, యూఎన్‌ అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) వెల్లడించింది. 2021 నాటికి దాదాపు 4.7 కోట్ల మంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికంలోకి నెట్టివేయబడతారని ఆందోళన వ్యక్తం చేసింది.
 

                                                            పేదరికం అంటే ?

అసలు పేదరికం అంటే..! సామాజిక, ఆర్థిక సమస్య. ప్రస్తుతం ఇది దీర్ఘకాలిక సామాజిక సమస్య. సమాజంలో ఒక వర్గం కనీస అవసరాలైన ఆహారం, గృహవసతి, దుస్తులు పొందలేని పరిస్థితి. పేదరికంతో బాధపడుతున్న వారిని పేదలు అంటారు. పేదరికమే అత్యంత తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ అన్నారు. వివిధ పథకాల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకు చేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 

                                                            ప్రపంచ దేశాల పరిస్థితి...

పేదరికం ఓ సవాలు..

అనేక దేశాల్లో ఆకలి ప్రధాన సమస్యగా వేధిస్తోంది. గతేడాది 88 దేశాల్లో 10 కోట్ల మంది అన్నార్తులకు తోడ్పాటును అందించిన ప్రపంచ ఆహార కార్యక్రమాన్ని (డబ్ల్యూఎఫ్‌పీ)కి నోబెల్‌ శాంతి బహుమతి లభించడం ముదావహం. కోవిడ్‌ ప్రభావంతో నిరుద్యోగ సమస్య అధికమైంది. ఫలితంగా పేదరికం మరింతగా విజృంభించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉండే జనాభా శాతం ఈసారి భారీగా పెరిగిందని అంచనా. అయితే దెబ్బతిన్న దేశాల్లో ఉపాధి లేమి ఎందుకు అధికమైంది? అదే సమయంలో చైనా లాంటి సోషలిస్టు దేశాల్లో ఆ ప్రభావం ఎందుకు కనిపించలేదు? అక్కడా కరోనా అదే రీతిలో ప్రభావం చూపింది కదా! అయితే ఉపాధి విషయంలోనూ, ఆర్థిక వ్యవస్థ పతనంలోనూ ఆ దేశాలు అనుసరించిన విధానాలు ప్రపంచ దేశాలకు ఏం పాఠం నేర్పుతున్నాయి? ఆయా దేశాలు వాటిని స్వీకరించే దశలో ఉన్నాయా? అనేవి మనముందున్న ప్రశ్నలు. చాలా దేశాల్లో కరోనా సమయంలో ఉపాధి దెబ్బతిని, అసంఘటిత రంగంలోని ఎంతోమంది పేదరికం బారినపడ్డారు. అందుకు ప్రభుత్వాలు అనుసరించే సరళీకరణ ఆర్థిక విధానాలు కారణం కాదా? మరి సోషలిస్టు దేశాల్లో అసంఘటిత రంగ కార్మికులు ఆ పరిస్థితిని ఎలా అధిగమించగలిగాయి? అక్కడి ప్రభుత్వాలు వారిని ఏ విధంగా ఆదుకున్నాయి?
    యుఎన్‌-వైడర్‌ వర్శిటీ అధ్యయనం ప్రకారం చాలా దేశాల్లో తలసరి ఆదాయంలో 10 శాతం మేర కోత పడింది. ఆ ప్రాతిపదికన అమెరికాలో రోజువారీ ఆదాయం రూ.142.57కి లోబడి ఉన్నవాళ్లు 18 కోట్లకు, రూ.240.11కి దిగువన ఉన్నవారు 28 కోట్లు. రూ.240.11 కంటే తక్కువ ఉన్నవాళ్లు 25 కోట్లమంది అని అంచనా. 2030 నాటికి పేదరికానికి చరమగీతం పాడాలన్న ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు కోవిడ్‌ ఆటంకంగా మారిందనడంలో వాస్తవం ఎంత? అప్పటికే ప్రపంచంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ఒకవైపు ఆటంకంగా ఉంటే.. కరోనా మరోవైపు నుండి కోలుకోలేని దెబ్బ కొట్టింది. సబ్‌ సహారా ఆఫ్రికా, దక్షిణాసియాల్లో పేదల సంఖ్య మరింత ముమ్మరం అవ్వడానికి కారణాలు ఏంటి? ప్రపంచంలోని పేదల్లో మూడింట రెండొంతులు ఈ ప్రాంతాల్లోనే ఉన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. రోజుకు రూ.240.11 కంటే తక్కువ సంపాదనను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాసియాలో పేదల సంఖ్య 2018లో 84.7 కోట్లు. ఈ ఏడాది ఆ సంఖ్య 91.5 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభం, కరోనా వల్ల ఈ ఏడాది 8.8 నుంచి 11.5 కోట్ల మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలో ఉన్నారని ప్రపంచబ్యాంకు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్‌ కొత్తగా ముంచుకొచ్చిన ముప్పు. కానీ, సరళీకరణ ఆర్థిక విధానాలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా పేదరికం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీనికి పరిష్కారం ఏమిటి ?
 

                                                                       భారత్‌లో...

పేదరికం ఓ సవాలు..

కోవిడ్‌కు ముందే భారత ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉంది. అందుకు కారణం పాలకులు అత్యంత వేగంగా అమలు జరుపుతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలే. ఫలితంగా నిరుద్యోగం, ఆదాయాల్లో కోత, గ్రామీణ సంక్షోభం, పౌష్టికాహార లేమి, విస్తరిస్తున్న అసమానతలు దేశాన్ని మరింత వెనక్కినెట్టాయి. మరోవైపు అసంఘటిత రంగంలోని 46.5 కోట్ల మందికి కనీస వేతనాలు లేవు. ఇక వ్యవసాయ కార్మికుల సమస్యలు చెప్పనలవి కావు. పొట్ట చేతబట్టుకుని సుదూర ప్రాంతాలకు వలసవెళ్లిన కార్మికులు లక్షలాదిగా ఉన్నారన్న విషయం ఒకరకరంగా లాక్‌డౌన్‌ వెలుగులోకి తెచ్చింది. పుట్ట పగలినట్లు పేదలు కుప్పలుతెప్పలుగా దేశవ్యాప్తంగా ఎలా ఉన్నారో స్పష్టమైంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) అంచనాల ప్రకారం దేశంలో నిరుద్యోగం 8.4 నుంచి 27 శాతానికి పెరిగింది. 12.2 కోట్ల మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. ఇందులో చిన్న వ్యాపారులు, కార్మికులే 9.1 కోట్లమంది ఉన్నారు. ఆర్థిక సంక్షోభంతో భారత్‌లో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు దుర్భర దారిద్య్రంలోకి నెట్టబడ్డారు. ఇది అంతర్జాతీయ కార్మిక సంఘ నివేదిక అంచనా. మరి ఇలాంటి సమయంలో మన కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలేంటి? తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని తరిమికొడతామన్న ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఆ దిశగా ఎంత వరకూ సఫలమైంది? దేశవ్యాప్తంగా ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఉపద్రవాలు తలెత్తినప్పుడు ప్రభుత్వం ప్రకటించిన పునరుజ్జీవన ప్యాకేజీ ఎవరికి లాభం చేకూర్చింది? ఆ ప్యాకేజీలను తీసుకున్న కార్పొరేట్లు లక్షల సంఖ్యలో ఉద్యోగాలను ఎందుకు తొలగించారు? ఒక వేళ పేదలకే ఆ ప్యాకేజీ చేరితే ఆర్థికవ్యవస్థ ఎందుకు గాడి తప్పింది? పేదరికాన్ని తరిమికొట్టేందుకు కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలేంటి? పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేసే ప్రకటనలన్నీ ఆర్భాటానికేనా? ఒక వేళ అమలైతే, దేశంలో తగ్గాల్సిన పేదరికం ఎందుకు పెరిగింది? నోట్ల రద్దు తర్వాత దేశం రూపురేఖలు మారిపోతాయని చెప్పిన కేంద్రం అంచనాలు ఏమయ్యాయి? పేదల దరికి భారీ ఎత్తు నగదు బదిలీ కార్యక్రమానికి తీసుకెళ్తామని ఇచ్చిన హామీలేవి? అయితే ఇందుకు భిన్నంగా కమ్యూనిస్టులు పాలిస్తున్న కేరళలో కరోనా సమయంలో ఉపాధి సమస్యను ఎలా అధిగమించగలిగారు? వైద్యరంగంలో సమస్యలను అధిగమించడానికి అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? కరోనాలో దేశంలో ఏ రాష్ట్రం అందించని విధంగా పేదల ఆకలి తీర్చేందుకు 14 రకాల నిత్యావసరాలు ఎలా పంచగలిగారు? కేంద్రం చేయలేని వాటికి పరిష్కారం చూపిస్తున్నాయి. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ఎంత వరకూ సమంజసం? మన దేశంలో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రధాన రంగం వ్యవసాయ రంగం అని అందరికీ తెలిసిందే. మరి అలాంటి రంగాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి విధానాలు అనుసరిస్తుంది? రైతులకి ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహకారం ఎంత? ఇతర దేశాల్లో వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో పోలిస్తే మనం ఇస్తున్నదెంత? అసలు ప్రభుత్వం రైతుల పక్షమా? కార్పొరేట్ల పక్షమా? అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే.

 

పేదరికం ఓ సవాలు..

                                             

                                                         ఆర్థిక విధానాలు - ధరల పెరుగుదల..

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరించిన సరళీకరణ ఆర్థిక దివాళాకోరు విధానాలు, కోవిడ్‌ సంక్షోభ సమయంలో దాని అసమర్థ నిర్వాకం ప్రజల పాలిట పెను శాపంగా మారాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి బడా పారిశ్రామిక వేత్తలకు కొమ్ము కాస్తోంది. భూమి, ఖనిజాలు, గ్యాస్‌, స్పెక్ట్రమ్‌ వంటి దేశ సహజ వనరులను లూటీ చేసుకోవడానికి అనుమతించింది. ఫలితంగా కార్పొరేట్‌ కుటుంబాలు, ప్రైవేటు కంపెనీలు అసాధారణ రీతిలో లాభాలు సంపాదిస్తున్నాయి. పైగా దేశాన్ని ముందుకు తీసుకుపోతామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను నష్టాల పేరుతో కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే మన రాష్ట్రంలోని విశాఖ ఉక్కు పరిశ్రమ. వాస్తవానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందల్లా ఏదన్నా ఉందంటే దేశం ప్రజల సహజ వనరులను కొద్దిమంది బడా పెట్టుబడిదారులకు స్వాధీనపరచడమే. సంపన్నులకు వర్తించే పన్ను రేట్లు పెంచడం ద్వారా గానీ, పన్ను ఎగవేతపై పెద్దపెట్టున విరుచుకుపడటం ద్వారా గానీ ఆదాయం పెంచుకోడానికి వీలున్నప్పటికీ, అలాంటి చర్యలేమీ తీసుకోలేదు.

 

పేదరికం ఓ సవాలు..


 

                                                   నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలు

ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించటం కోసం మొదట చేయాల్సిన పని దారిద్య్రాన్ని నిర్మూలించటం. అందుకు ఉపాధిని కల్పించడం. ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపర్చుకోవడం. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతోపాటు సాధికారిక కార్యక్రమాలకు నాంది పలకడం. ముఖ్యంగా ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయడం. అందరికీ సమానంగా విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచడం. లింగ వివక్ష లేకుండా మహిళలకు స్వావలంబన కల్పించడం. భారత్‌ వంటి దేశాల్లో తప్పనిసరిగా వ్యవసాయానికి తగిన ప్రాధాన్యమివ్వటం.. ఈ రంగంలో సాధించే అభివృద్ధి వల్ల రెండింతలు పేదరికం తగ్గుతుందనేది ఆర్థికవేత్తల అంచనా. నైపుణ్యాల కల్పన, యువతకు విరివిగా ఉపాధి అవకాశాల కల్పన. దీంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించడం, పరిశ్రమల స్థాపనకు పెట్టుబడి పెట్టడం, ఉపాధిపై దృష్టి, విద్య, ఆరోగ్య వ్యవస్థలను అందరికీ అందుబాటులోకి తేవడం.. పేదరికంపై పోరులో చెప్పుకోదగిన ముందడుగులు. అసమానతలను రూపు మాపేందుకు ఆర్థిక విధానాల్లో సమూల మార్పు రావాలి. ప్రైవేటు, కార్పొరేట్ల పక్షాన కాకుండా పేదల, పీడితుల పక్షాన ఆర్థిక విధానాలు ఉండాలి. ప్రధానంగా కుల, మత, లింగ భేదాల మధ్య అంతరాలు పోవాలి. అంతేకాకుండా సమిష్టి పనివిధానం.. సమాన పంపిణీ జరగాలి.. అప్పుడే దేశం నుంచి పేదరికాన్ని, అసమానతలను తరిమికొట్టడం సాధ్యం !

                                                      మహిళలపై మరింత ప్రభావం...

పేదరికం ఓ సవాలు..

ఇంట్లో అందరికీ కడుపు నిండా అన్నం పెట్టే అమ్మలు.. ఎంత మంది కడుపు నిండా తింటున్నారు? సంపూర్ణ ఆహారం అందుబాటులో లేనప్పుడు.. లింగ వివక్ష, ఆహార పంపిణీలో అసమానతలు తలెత్తుతున్నాయి. అనేక అధ్యయనాలు చెబుతున్న లెక్కల ప్రకారం దేశంలో సగానికి పైగా ప్రజలకు సంపూర్ణ ఆహారం అందడంలేదు. మరి ఇలాంటి తరుణంలో ఎంత మంది ఆడపిల్లలకు సంపూర్ణంగా ఆహారం అందుతుంది? దేశంలో మహిళ, బాలిక ఆరోగ్యంపై ఆ ప్రభావం ఎంత? ఫలితంగా దేశంలోని మహిళల్లో పెరిగిన రక్తహీనత ఎంత? అనే అంశాలు విశ్లేషకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ రంగంలోనైనా ఉపాధి సమస్య వచ్చినప్పుడు ప్రధానంగా తొలగించేది మహిళా ఉద్యోగులనే. దీంతో కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది, ప్రధానంగా మహిళలు ఉపాధిని కోల్పోయారు. ఫలితంగా రానున్న రోజుల్లో లింగపరమైన అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం, ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) 2021 చివరి నాటికి దాదాపు 4.7 కోట్ల మంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికంలోకి జారే అవకాశం ఉందని నివేదించింది. ఫలితంగా మహిళల విషయంలో కొన్ని దశాబ్దాలుగా సాధించిన పురోగతి పూర్తిగా తిరోగమనంలోకి వెళ్లే ప్రమాదం ఉందంటోంది. ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతంలో ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని యూఎన్‌డీపీ అభిప్రాయపడింది. 25-34 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు, బాలికలు దుర్భర పరిస్థితిని ఎదుర్కోవచ్చని తెలపడంతో రానున్న దశాబ్దకాలంలో పురుషుల కంటే మహిళలు ఆర్థికంగా వెనుకంజ వేస్తారని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థికవిధానాలు కోటి పది లక్షల మంది బాలికలను ప్రపంచవ్యాప్తంగా పాఠశాలకు దూరం చేసిందని యునెస్కో అంచనా. కరోనా విజృంభణకు ముందు దక్షిణాసియాలో మహిళల పేదరికం రేటు దాదాపు 10 శాతంగా అంచనా వేయగా, ప్రస్తుతం అది 13 శాతానికి పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడించింది. దక్షిణాసియాలో 2030 నాటికి మహిళా పేదరికం రేటు దాదాపు 15.8 శాతంగా ఉండవచ్చని, ప్రస్తుత పరిస్థితుల అనంతరం అది 18.6 శాతానికి పెరిగే అవకాశం ఉందని, వచ్చే ఏడాదికి దాదాపు 9.6 కోట్ల మంది మహిళలు పేదరికంలోకి నెట్టబడతారని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఈ రకంగా చూస్తే ఐరాస తన లక్ష్యాలను ఎప్పటికి చేరుకుంటుంది ?

                                                 పేదరిక నిర్మూలనలో 'కీలకదశ'కు చైనా

పేదరికం ఓ సవాలు..

పిడికెడు ఉప్పుకోసం ఆడపిల్లలను తాకట్టు పెట్టే దీనస్థితి నుండి నల్లమందు మత్తు నుండి బైటపడి ప్రపంచంలోనే అభివృద్ధికి చిరునామాగా చైనా ప్రజలు నిలిచిన తీరు అనితర సాధ్యం! ఈ రోజు ఎన్నో దేశాలకు చైనా ఆర్థికవ్యవస్థ, అక్కడ తయారయ్యే అధిక ఉత్పత్తులతో సగర్వంగా ప్రపంచంలో నిలిచింది. కరోనా కష్టకాలంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ నేల ముఖం చూస్తూంటే, చైనా ఆర్థికవ్యవస్థ మాత్రం దానికి భిన్నంగా పైపైకి దూసుకుపోతోంది. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? అధిక జనాభా కలిగిన దేశం కరోనా కష్టకాలంలో సైతం పేదరికాన్ని ఎలా నిర్మూలించగలిగింది? తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరగలిగింది? ఇవే కదా ప్రపంచం ఆలోచించాల్సిన విషయాలు.
     అయితే గతంలో అంచనా వేసిన దానికన్నా ఈ ఏడాది చైనా వృద్ధి రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రపంచబ్యాంకు పేర్కొంది. ఇదంతా ఒక్క రోజులో, ఒక్క ఏడాదిలోనో జరిగినదేమి కాదు! ఒక వ్యూహం ప్రకారం, ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ చైనా కమ్యూనిస్టు పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం జరిపిన కృషి అని శతవసంతాల కమ్యూనిస్టు పార్టీ వార్షికోత్సవాల సందర్భంగా చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌ సిపిసి కమిటీ సమావేశాల్లోని కీలకోపన్యాసంలో ప్రకటించారు. 2012లో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభల తర్వాత దేశంలో పేదరిక నిర్మూలనలో గణనీయమైన ప్రగతిని సాధించామని చెప్పుకొచ్చారు. 2012లో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 9.899 కోట్ల మంది పేదల సంఖ్యను 2018 నాటికి 1.66 కోట్లకు తగ్గించగలిగామని వివరించారు.
        కొంత కాలంగా ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించడం ద్వారా అభివృద్ధి లక్ష్యాలను మరింత వేగంగా సాధించడానికి ఆ దేశం ప్రణాళికలు రచించుకుంది. అయితే, ఆ మేరకు అధిక భాగస్వామ్యంతో ప్రభుత్వరంగం పట్టు ఎక్కడా జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంది. ప్రైవేటు రంగంలోని అవినీతి జాడ్యం ప్రభుత్వ ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు వ్యాపించకుండా కఠినంగా వ్యవహరించింది. సంస్కరణలు అమలు ద్వారా దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ను సాధించింది. ప్రపంచంలోని 500 ఫార్చ్యూన్‌ సంస్థల్లో చైనా నుండి 124 సంస్థలకు స్థానం దక్కగా, వాటిలో 91 ప్రభుత్వ సంస్థలే! చైనాలో ప్రభుత్వరంగ ఆధిపత్యానికి ఇదే నిదర్శనం. అదే సమయంలో ప్రైవేటు రంగానికీ పరిమితుల మేరకు అవకాశాలను కల్పిస్తూనే సంపద విదేశాలకు తరలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. బహుముఖాలుగా విస్తరించిన ఈ కార్యాచరణే చైనా ప్రజలను పేదరికం నుండి దూరం చేయగలిగింది. కష్ట కాలంలోనూ కొనుగోలు శక్తి పెంచుకోవడానికి, తద్వారా అభివృద్ధిని సుస్థిర పరుచుకోవడానికి దోహదం చేసింది. ఇలా చైనా ఒక్కటే కాదు.. సోషలిస్టు దేశాలైన క్యూబా, రష్యా, వియత్నాం, ఉత్తర కొరియా వంటి దేశాల్లోనూ ఇలాంటి ప్రణాళికలూ అనుసరిస్తూ ఆర్థికవ్యవస్థను అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తుంటే... అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ఆయా దేశాలు అవలంభిస్తున్న విధానాల్లో లోపాలేంటి? ఆ తరహా విధానాలు ఇతర దేశాల్లో ఎందుకు అమలు చేయడం లేదు? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

                                                      ఆకలి సూచీలో 101వ స్థానం..

పేదరికం ఓ సవాలు..

దేశంలో ఆకలి ఘోష తీవ్రస్థాయికి చేరుకుంది. సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకునే మోడీ హయాంలో ఆకలి సూచీలో మనదేశ స్థానం దిగజారింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య తీవ్రంగా ఉన్న 31 దేశాల సరసన భారత్‌ ఒకటిగా నిలిచింది. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ 2021 జాబితాలో మొత్తం 116 దేశాలకుగానూ భారత్‌ 101వ స్థానంలో నిలిచింది. మనదేశం తరువాతి స్థానాల్లో పాపువా న్యూ గినియా (102), ఆఫ్ఘనిస్తాన్‌, నైజీరియా (103), కాంగో (105), మోజాంబిక్‌, సియార్రా లియోన్‌ (106), తిమోర్‌ లెస్తే (108), హైతీ (109), లిబియా (110), మడగాస్కర్‌ (111), డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (112), చాద్‌ (113), సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ (114), యెమన్‌ (115), సోమాలియా (116) దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో అట్టడుగున సోమాలియా ఉంది. భారత్‌ కన్నా పాకిస్తాన్‌ (92), నేపాల్‌, బంగ్లాదేశ్‌ (76)కు ఉత్తమ ర్యాంక్‌లు లభించాయి. గత ఏడాది మొత్తం 107 దేశాలకు గాను భారత్‌కు 94వ ర్యాంక్‌ లభించింది. కాగా ఈ ఏడాది మరింత దిగజారి పోవడం ఆందోళనకరం. అయితే ఇదే సమయంలో చైనా, క్యూబా, లాత్వియా, రొమేరియా వంటి దేశాలు మొదటి 18 స్థానాల్లో నిలవడం అభినందించదగ్గ విషయం.

                                                                   ఇలా...

పేదరిక నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి ఏటా అక్టోబర్‌ 17న 1992 డిసెంబర్‌ 22న ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ సందర్భంగా వివిధ దేశాలు పేదరిక నిర్మూలనకు చేపడుతున్న చర్యలు, అభివృద్ధి, వివిధ కార్యక్రమాలు, పథకాలు విడుదల చేస్తారు. 1987లో ఫ్రాన్స్‌లో మొదటిసారిగా దీన్ని జరుపుకున్నారు. దాదాపు పది లక్షల మంది మానవహక్కుల కోసం ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఉద్యమాన్ని ఎటిడి ఫోర్త్‌ వరల్డ్‌ వ్యవస్థాపకుడు జోసెఫ్‌ వ్రెంకీ ప్రారంభించారు.

                                                           నిరుద్యోగం- ప్రభావాలు..

పేదరికం ఓ సవాలు..

నిరుద్యోగం అతని కుటుంబాన్ని ఆదాయానికి సంబంధించి మాత్రమే కాకుండా, ఆరోగ్యం, మరణాల విషయంలోనూ ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ప్రభావాలు దశాబ్దాలపాటు కొనసాగుతున్నాయి. ఆర్థికవ్యవస్థపై నిరుద్యోగ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నిరుద్యోగంలో ఒక్క శాతం పెరుగుదల జిడిపిని రెండు శాతం తగ్గిస్తుంది. నిరుద్యోగం పెరగడం నేరస్థుల సంఖ్యనూ పెంచుతుంది. 2009 పెన్సిల్వేనియా అధ్యయనం ప్రకారం నిరుద్యోగ కార్మికులు సగటు కంటే ఒక సంవత్సరం ముందుగానే మరణిస్తారు. వీరిలో డిప్రెషన్‌ పెరిగి, కాలక్రమేణా ఇతర ఆరోగ్య సమస్యలూ తీవ్రమవుతాయి. అయితే దేశంలో కరోనా సమయంలో నిరుద్యోగం మరింత తీవ్రమైంది. కానీ కేరళలో ఇందుకు భిన్నంగా పరిశ్రమలన్నీ కరోనా సమయంలోనూ పనిచేశాయి. వలస కార్మికులు తిరిగి సొంతూళ్లకు వెళ్లకుండా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది. తద్వారా పరిశ్రమలు మూతబడకుండా, ఉద్యోగాలకు కోత విధించకుండా ఆర్థికవ్యవస్థ దెబ్బతినకుండా చూసింది. అయితే ఇదే పనిని కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోయాయి? పేదలకు సంక్షేమ ఫలాలను అందించడంలో లోపం ఎక్కడుంది? ఇటు దేశంలో కేరళలో కానీ, అటు ప్రపంచంలో చైనాలో కానీ కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఎలా అభివృద్ధి సాధించగలుగుతున్నాయి? కమ్యూనిస్టులు అభివృద్ధి నిరోధకులు అనే వారి పాలనలో పేదరికం ఎందుకు కనిపిస్తోంది? సోషలిస్టు వ్యవస్థ అవలంభిస్తున్న విధానాలకూ, పెట్టుబడిదారీ వ్యవస్థ అవలంభిస్తున్న విధానాలకూ తేడా ఏంటో గమనించాలి. ప్రధానంగా సోషలిస్టు దేశాల్లో, రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగాన్ని దెబ్బతినకుండా ప్రోత్సహించడం, ప్రభుత్వ రంగంలో ఉపాధి దెబ్బతినకుండా ఉండటం, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటూనే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ రంగాలైన విద్య, వైద్యం సేవలపై పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉండటం వల్ల ఆ దేశాలు, రాష్ట్రాలు అభివృద్ధిని సాధిస్తున్నాయనేది విశ్లేషకులు చెప్తున్న మాట.

ఉదయ్ శంకర్‌ ఆకుల
7989726815