Jul 19,2023 23:14
సంతమాగులూరు మండలంలో సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్న బాచిన కృష్ణచైతన్య

ప్రజాశక్తి-సంతమాగులూరు: పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర శాప్‌ నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్య తెలిపారు. బుధవారం మండలంలోని వెల్లలచెరువు, సజ్జాపురం గ్రామాలలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు ధ్రువీక రణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ, పేద ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. గడచిన నాలుగు సంవత్సరాల కాలంలో పేదలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. ఇప్పటికైనా అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి, జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వారికి సంక్షేమ పథకాలు అందజేస్తామని అన్నారు. ముందుగా ఆయా గ్రామాలలో కష్ణ చైతన్యకు గ్రామాలలోని నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వై ఎలమంద, ఎంపీడీవో జీ లక్ష్మీదేవి, తహశీల్దారు టీ ప్రశాంతి, ఈఓఆర్‌డి బ్రహ్మనాయుడు, నాయకులు చింతా రామా రావు, చింతా శ్రీధర్‌, అట్లా పెద్ద వెంకటరెడ్డి, ఓరుగంటి కోటిరెడ్డి, సన్నెబోయిన గురుయాదవ్‌, ఎంపీటీసీలు, సర్పం చులు, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
వేటపాలెం: జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజా సమస్యలు సంపూర్ణంగా పరిష్కరిస్తామని వైసిపి చీరాల ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ బాబు తెలిపారు. బుధవారం ఆయన వేటపాలెం మండల పరిధిలోని దేశాయిపేట-2, వేటపాలెం-3 సచివాలయాలలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే పరిష్కరించనున్నట్లు తెలిపారు. జగనన్న అధికారం చేపట్టినాక 95 శాతం పేదలందరికీ పథకాలను అమలు చేశారని అన్నారు. ఇంకా ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ముందుగా ఆయా సచివాలయల సిబ్బంది, ద్వితీయ శ్రేణి వైసిపి నాయకులు వెంకటేష్‌ బాబుకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్‌ ఏడి కృష్ణకిషోర్‌ సాంఘిక సంక్షేమ శాఖ డిడి, వేటపాలెం మండల స్పెషల్‌ ఆఫీసర్‌ రాజాదెబోరా, ఎంపీడీవో నేతాజీ, తహశీల్దారు అశోక్‌వర్ధన్‌, ఏపీఎం బోదాటి శ్రీనివాసరావు, ఏపీఓ వి సుధారాణి, రామన్నపేట ఉప సర్పంచి దంతం వెంకట సుబ్బారావు, నాయకులు మున్నంగి అరుణ్‌ కుమార్‌, అందే కృష్ణ, సామెల్‌, ఖాదర్‌ కజ్జి పాల్గొన్నారు.