ప్రజాశక్తి-సంతమాగులూరు: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనను, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, ప్రతి ఒక్కరికీ వివరించాలని రాష్ట్ర శాప్ నెట్ ఛైర్మన్, అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని పుట్టావారిపాలెం గ్రామ సమీపంలో ఉన్న వల్లభ పాల డెయిరీ ఆవరణలో వైసీపీ పార్టీ మండల కన్వీనర్ చింతా రామారావు అధ్యక్షతన జరిగిన మండల సచివాలయ, కన్వీనర్లు, గహ సారథుల సమన్వయ అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ, గత మూడున్నర ఏళ్లుగా కరోనా మహమ్మారితో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, దేశంలో మరెక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. దేశ చరిత్రలో సుపరిపాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించి చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో పార్టీ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, రానున్న సాధారణ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అడవి శ్రీనివాసరావు, నాయకులు బొల్లినేని రామకృష్ణ, ఓరుగంటి కోటిరెడ్డి, ముసలారెడ్డి, నాగబోతు రామాంజనేయులు, దమ్ము శ్రీను, అట్లా పెద్ద వెంకటరెడ్డి, దుద్దేల గాలెయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.










