Jun 19,2023 21:33

ప్రజలకు ప్రభుత్వ లబ్ధిపత్రాలను అందజేస్తున్న జగన్మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వైసిపి నియోజకవర్గ సీనియర్‌ నాయకులు ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. సోమవారం 30వ వార్డులో మూడోరోజు 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, వాటి ద్వారా పొందిన లబ్ధిని వివరించారు. వార్డు పరిధిలోని కొన్ని వీధుల్లో తాగునీటి సరఫరా, సిసి రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని మరోసారి గెలిపించుకుందామని తెలిపారు. ప్రస్తుతం అన్ని వార్డుల్లోనూ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రణాళిక మేరకు సిసి రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎఐఐబి స్కీం కింద మంజూరైన రూ.142 కోట్లతో పైపులైన్లు, ట్యాంకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. అవి పూర్తయితే ఇంటింటికి కుళాయిలు మంజూరు కానున్నట్లు తెలిపారు.