Oct 17,2023 21:02

పేదలతో మాట్లాడుతున్న అంగేరి పుల్లయ్య

పేదలపైకి జేసీబీలు
పేట్రేగిపోతున్న అధికార ఆగడాలు
శ్రీ ఈదులగుంటలో ఉద్రిక్తత శ్రీ పట్టించుకోని రెవెన్యూ

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి/తొట్టంబేడు
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొందరు అధికారపార్టీ నేతల ఆగడాలు అంతకంతకూ పేట్రేగిపోతున్నాయి..అధికారం అండగా ఎంతకైనా తెగించేస్తున్నారు..కడకు ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను సైతం కూల్చేందుకు వెనకాడటం లేదు..ఈ క్రమంలోనే అధికారపార్టీకి చెందిన ఓ నేత మంగళవారం ఈదులగుంట, అప్పలాయగుంట ప్రాంతంలో నివసిస్తున్న పేదల ఇళ్లను మందీమార్భలంతో వచ్చి ఖాళీ చేయించే ప్రయత్నం చేశాడు. దీంతో స్థానికులు తిరగబడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి పోతే...శ్రీకాళహస్తి పట్టణానికి కూతవేటు దూరంలో ఈదులగుంట, అప్పలాయగుంట ప్రాంతాలు ఉన్నాయి. గతంలో ఈ రెండు ప్రాంతాలు చెరువు, వరవ కాలువలు, కాలువ పోరంబోకు భూములతో కూడుకుని ఉండేవి. అయితే కాలక్రమేణా చెరువులు ఆక్రమణ గురికావడం, అక్కడ పెద్దలు, పేదలు స్థిర నివాసాలు ఏర్పరుచుకోవడంతో కాలనీలుగా మారిపోయాయి. సుమారుగా 30 ఏళ్లుగా ఇక్కడ నివాసాలు ఏర్పరుచుకుంటుండంతో చెరువులు, కాలువలన్న బేధం లేకుండా కనుమరుగైన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈదులగుంట(తొట్టంబేడు మండల రెవెన్యూ), అప్పలాయగుంట(శ్రీకాళహస్తి రెవెన్యూ) పరిధిలో సుమారు 250 మంది పేదలు గత 30 యేళ్లుగా స్థిర నివాసాలు ఏర్పరుచుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ప్రభుత్వము అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించింది. రేషన్‌, ఆధార్‌ కార్డులతో పాటు, కరెంట్‌ సర్వీసులు అందజేసింది. అయితే అప్పలాయగుంట ప్రాంతంలో తమ భూమి ఉందని చెప్పుకుంటున్న అధికారపార్టీకి చెందిన ఓ వ్యక్తి అక్కడ నుంచి పేదలను ఖాళీ చేయించాలని ఎన్నాళ్లగానో ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు అధికారపార్టీతో పాటు రెవెన్యూ అండగా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే పలు దఫాలుగా అక్కడున్న పేదలను నయానో భయానే బెదిరించే ప్రయత్నం చేసినా బెడిసి కొడుతోంది. దీంతో మంగళవారం సుమారు 50 మంది అనుచరులతోటి రెండు జేసీబీలు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో చదును చేసే ప్రయత్నం చేశాడు. దీంతో స్థానికులు తిరగబడి జేసీబీలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టూటౌన్‌ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కనీసర కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. పైగా సదరు వ్యక్తికి పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పేదలకు హక్కు కల్పించాలి: సీపీఎం
ఈదులగుంట, అప్పలాయగుంట ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పరుచుకుని జీవనం సాగిస్తున్న పేదలకు ప్రభుత్వం సర్వ హక్కులు కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈదులగుంట వివాదం నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సంఘటనా స్థలానికి సీపీఎం నాయకులు వెళ్లారు. అక్కడ పేదలను పరామర్శించి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏదేని భూమిలో 12 ఏళ్ల పాటు పేదలు స్థిర నివాసాలు ఏర్పరుచుకుంటే వారికి అన్ని హక్కులు కల్పించాలని సీపీఎం జిల్లాకార్యదర్శి వర్గ సభ్యుడు అంగేరి పుల్లయ్య అన్నారు. అలా కాకుండా పేదలను ఖాళీ చేయించే ప్రయత్నం చేయడం చట్ట విరుద్ధమన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించి పేదలకు అన్ని హక్కులూ కల్పించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం నాయకులతో పాటు జనసేన నాయకులు కొట్టే సాయి, మహేష్‌ కూడా పేదలకు అండగా నిలబడ్డారు. సీపీఎం నాయకులు గంధం మణి, పెనగడం గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
పేదలతో మాట్లాడుతున్న అంగేరి పుల్లయ్య