Jun 28,2023 00:43

ప్రజాశక్తి - చిలకలూరిపేట : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వార సరఫరా అవ్వాల్సిన కందిపప్పు కోసం పేదలు నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.140 వరకు ఉండగా రేషన్‌ ద్వారా రూ.67కే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. గోదుమ పిండి మార్కెట్లో కిలో రూ.50 కాగా రేషన్‌ ద్వారా రూ.15కు, పంచదార రూ.40-45 వరకు ఉండగా రేషన్‌లో రూ.33కు విక్రయిస్తారు. బహిరంగ మార్కెట్లో ధరలు అధికంగా ఉండడంతో సామాన్యులంతా రేషన్‌ ద్వారా సరఫరా అయ్యే సరుకుల మీద ఆధారపడుతున్నారు. అయితే చిలకలూరిపేటకు నాలుగు నెలలుగా కందిపప్పు సరఫరా కావడం లేదు. దీనిఐ డీలర్లను సంప్రదింగా తమకే సరఫరా లేదనే సమాధానం వస్తోంది. దీంతో పేదలు అధిక ధరలు భరించి బహిరంగ మార్కెట్లోనే కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే ఒక్కో నెలలో ఒక్కో మండలానికి 20 శాతం చొప్పున మాత్రం కందిపప్పు సరఫరా చేస్తూ సరిపెడుతున్నారని తెలిసింది.
చిలకలూరిపేట పట్టణ, మండలంలోని గ్రామాల పరిధిలో 42 వేల బియ్యం కార్డులున్నాయి. నియోజవకర్గం మొత్తంగా వీటి సంఖ్య 82 వేల వరకూ ఉంటుంది. ఒక్కో కార్డుకు కిలో లెక్కన ప్రతినెలా నియోజకవర్గానికి 8.2 టన్నుల కందిపప్పు సరఫరా కావాల్సి ఉంది. సరఫరా అవ్వని కారణంగా కార్డుదారులు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో కిలోకు రూ.73 వరకూ పేదలు భారాన్ని భరిస్తున్నారు. ఒక్కో కార్డుదారు నాలుగు నెలలుకు రూ.292 అదనపు భారాన్ని భరించారు. నియోజకవర్గం మొత్తంగా ఈ భారం ఈ నాలుగు నెలల్లో రూ.2 కోట్ల 39 లక్షల 44 వేలుగా ఉంది. జులై నెలకు సంబంధించిన డీడీలనూ కేవలం బియ్యం, పంచదారకే డీలర్లు చెల్లించినట్లు సమాచారం. ఒకవైపు బక్రీదు నేపథ్యంలో రేషన్‌ సరుకులు పెంచి ఇవ్వాలనే డిమాండ్‌ వ్యక్తమవుతుండగా ఈనెలా పరిమితంగానే సరుకుల సరఫరా చేస్తారనే సమాచారం పేదల్లో నిరాశ కలిగిస్తోంది.