ప్రజాశక్తి - కొత్తచెరువు : పేద ప్రజలకు వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీలలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి అప్పులపాలు చేసిందనిజనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి పత్తిచంద్రశేఖర్ విమర్శించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొత్తచెరువులోని పెనుగొండ రోడ్డువద్ద గల జగనన్న కాలనీలో నిర్మాణాలను వారు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 483 సర్వే నెంబర్లు 379 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి వారికి గృహాలు మంజూరు చేశారన్నారు. ఈ కాలనీకి రహదారి సౌకర్యం లేదన్నారు. కొండగుట్టల్లో ఇచ్చిన స్థలాల్లో నిర్మాణాలు చేయాలంటే పేదలకు తలకు మించిన భారం అవుతోందన్నారు. ఎక్కడ చూసినా గుంతలు ఉండడంతో లబ్ధిదారులు ఎవరు ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోకపోతే పట్టా రద్దు చేస్తామనడంతో లబ్ధిదారులు పునాదులకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. నాలుగు సంవత్సరాలు పూర్తయిన ఇళ్ల నిర్మాణాలు ఎక్కడ కానీ మొదలు కాలేదన్నారు. ఇక్కడ ఇంటి నిర్మాణాలు చేపట్టితే పెద్దపెద్ద బండరాళ్లు కొండలో నుండి కిందికి పడితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు ప్రభుత్వం స్పందించి నిర్మాణాలకు రుణాలను పెంచి వాటి నిర్మాణాలను వేగవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి అబ్దుల్ అబూ, కన్వీనర్లు పూల శివప్రసాద్, జయరాం, తలారి పెద్దన్న, నాయకులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, రామాంజి తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : కదిరి పట్టణం గట్లు వద్ద ఉన్న జగనన్న కాలనీలో జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాదు అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కాలనీ సందర్శించి అక్కడి సమస్యలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఎన్నో అబద్దపు హామీలు ఇచ్చి, ఆ తర్వాత గద్దెనెక్కి నవరత్నాలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జగనన్న కాలనీ ప్రజలను నిట్టనిలువునా మోసం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికి ఈ శాఖకు ఇద్దరు మంత్రులు మారారని కానీ ఇల్లుళ్లు ఎన్ని పూర్తయ్యాయో, ఎన్ని కాలేదో కనీసం సమీక్ష చేసిన పాపాన పోలేదని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే లకు, మంత్రులకు ధైర్యం ఉంటే జగనన్న కాలనీలలో పర్యటించి అక్కడి ఎటువంటి వసతులు ఉన్నాయో మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు చలపతి, నల్లచెరువు మండల అధ్యక్షులు రవికుమార్,కార్యక్రమల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ్, అంజిబాబు, కిన్నెరా మహేష్, రాజేంద్ర, హరిబాబు, చంద్రశేఖర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.










