Jun 30,2023 01:00
టిడిపి నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

ప్రజాశక్తి-సంతమాగులూరు: పేదలను ధనికుల్ని చేయాలన్నదే టిడిపి అధినేత చంద్రబాబు లక్ష్యమని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. గురువారం మండలంలోని పుట్టావారిపాలెం అడ్డ రోడ్డు గ్రామ సమీపంలో ఉన్న ఎమ్మెల్యే అతిథి గృహంలో, బల్లికురవ మండలం కొప్పెరపాడు, కూకట్లపల్లి, వెలమవారిపాలెం, కొత్తూరు గ్రామాల నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహానాడులో నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారెంటీ టిడిపి ప్రిలిమినరీ మినీ మేనిఫెస్టోని ఇంటింటికీ వెళ్లి వివరించాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ, జగన్‌రెడ్డి పాలనలో చేయడానికి పనిలేదు, సరైన సంపాదన లేదని అన్నారు. ధరలు చూస్తే కరెంటు బిల్లు నుంచి కూరగాయల వరకు అన్నింటి మీద రేట్లు పెరగడంతో సామాన్య ప్రజల బ్రతుకు భారంగా మారిందన్నారు. ఆడబిడ్డల్ని మహాశక్తిగా రూపొందించేందుకు మహాశక్తి పథకం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, 18 నుంచి 59 ఏళ్లు వయసు కలిగిన మహిళలకు నెలకు 1500 రూపాయలు, ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం కింద ఏడాదికి 15 వేల రూపాయలు, యువతకు 3,000 నిరుద్యోగ భతి, 20 లక్షల ఉద్యోగాల భర్తీ, రైతులకు ఏడాదికి 20 వేల రూపాయలు, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు, పూర్‌ టు రిచ్‌ పేరుతో పేదల్ని ధనికులుగా చేసేందుకే మేనిఫెస్టోని రూపొందించారని నేతలకు, కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.