ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: పేద ప్రజలు, విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు మరింత ముందుకు రావాలని రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా 9 చైర్మన్ సౌరబ్ పిలుపునిచ్చారు. రౌండ్‌టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద మంగళవారం అమతహస్తం సహకారంతో పేదలకు అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టేబుల్ ఇండియా దేశవ్యాప్తంగా 136 నగరాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 390 కోట్ల రూపాయల వ్యయంతో వేలాది తరగతి గదులను నిర్మించినట్లు ఆయన తెలియజేశారు. తమ సంస్థ పేద విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు ఎంతగానో ప్రోత్సహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, పలు పాఠశాలలు కూడా నిర్మించి కనీస సదుపాయాలు అయిన టాయిలెట్స్, లైబ్రరీలు నిర్మించడం జరిగిందన్నారు. రౌండ్ టేబుల్ ఇండియా కిచెన్ లో భాగంగా దేశవ్యాప్తంగా పది రోజుల పాటు ప్రతిరోజు 150 మందికి అన్నదానం చేయాలని లక్ష్యంగా విజయవాడ నగరంలో అమత హస్తం సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. తదనంతరం రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ చైర్మన్ జి. హర్ష మాట్లాడుతూ తమ సంస్థ తరపున విజయవాడ నగరంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా 60 వేల రూపాయలు అమత హస్తం ట్రస్టు కు ఇవ్వడం జరిగిందని పది రోజుల పాటు ఈ ట్రస్ట్ పేద ప్రజలకు అన్నదానం చేస్తుందని వివరించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ కౌశిక్ లేడీస్ సర్కిల్ చైర్పర్సన్స్ విమల, డాక్టర్ ప్రశాంతి, సంస్థ ప్రతినిధులు కాట్రగడ్డ మోహన్, తరణ్ దీప్ సింగ్ చలసాని బాబ్జి, అమత హస్తం ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.










