పెనుకొండ : 'ఏళ్ల తరబడి సొంత స్థలం లేక, ఇళ్లు లేక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనేక మార్లు వీరు అధికారులు ప్రజాప్రతినిధులకు దరఖాస్తులు అందించారు. అయినా వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేదు. పేదలంటే అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎందుకింత నిర్లక్ష్యం'... అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ ప్రశ్నించారు. పెనుకొండ మెడికల్ కళాశాల ఎదురుగా 668 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని భూస్వాధీన పోరాటం చేస్తున్న పేదలకు ఆయన బుధవారం నాడు మద్దతు తెలిపారు. సిఐటియు, వ్యకాసం, సిపిఎం ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న ఈ పోరాటం బుధవారం నాడూ కొనసాగింది. ఈ సందర్భంగా ఇంతియాజ్ పేదలను కలిసి వారితో మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో స్థలాలు చూపిస్తామని చెబుతున్నారని, ఆచరణలో అది అమలుకావడం లేదన్నారు. పెనుకొండలో ఇళ్ల పట్టాల కోసం అనేక మంది పేదలు దరఖాస్తు చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా వారిని పట్టించుకునే వారు లేరన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి పట్టాలు ఇచ్చేంత వరకు భూస్వాధీన పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, జిల్లా కార్యదర్శి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు వెంకటరాముడు, నారాయణ, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, వెంకటేష్, రంగప్ప, తిప్పన్నా, కొండ వెంకటేష్ పాల్గొన్నారు.










