
రామాపురం : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదలకు మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తోందని కలెక్టర్ గిరీష అన్నారు. శనివారం మండలంలోని నల్లగుట్టపల్లి గ్రామ సచివాలయంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును జిల్లా కలెక్టర్ గిరీష, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్య సురక్ష ద్వారా వైద్య సిబ్బంది ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఇంటి గడప వద్దనే ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించి రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఇక్కడ వైద్యం పొందుతున్న ప్రతి ఒక్కరి పేరు రిజిస్టర్ చేయించి వారి వ్యాధి నయం అయ్యే వరకు వైద్యులు మానిటర్ చేస్తారన్నారు. పేదలు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం జబ్బులకు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించి ఆదుకోవాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ హెల్త్ క్యాంపులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మెరుగైన వైద్య సేవలు పొంది ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిరంతరం పేదల కోసం శ్రమిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలనే తపనతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరం లాంటిదన్నారు. ప్రతి మనిషికి జీవితంలో ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలరన్నారు. నేడు ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా అన్ని రకాల జబ్బులకు మెరుగైన వైద్యం అందించి ఉచితంగా మందులు ఇస్తామన్నారు. గతంలో దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గుండె జబ్బులతో బాధపడుతున్న ఎంతోమంది పేదల జీవితాలలో వెలుగులు నింపారన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసి అన్ని వ్యాధులకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదలు గతంలో వైద్యం పొందాలంటే ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి నానా ఇబ్బందులు పడే వారన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఇంటికి వైద్యులు వెళ్లి రోగుల జబ్బు నయం చేసే విధంగా ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని వ్యాధులకు ఈ క్యాంపుల ద్వారా ఉచిత వైద్యం పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండయ్య ఎంపిపి విజయలక్ష్మి మాజీ ఎంపిపి జనార్దన్‌రెడ్డి, జడ్‌పిటిసి రమణ, ఎంపిటిసి నాగభూషణమ్మ వెంకటసుబ్బారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ విశ్వనాథరెడ్డి, సర్పంచ్ నాగభూషణ్ రెడ్డి, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.