
పేదలందరికీ మెరుగైన వైద్యం
- జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
- జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ప్రతి పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష ప్రధాన లక్ష్యమని ఐటీ సెక్రటరీ, జిల్లా స్పెషల్ అధికారి కోన శశిధర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లాలోని వెలుగోడు, నంద్యాల పట్టణంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వైద్య శిబిరాల నిర్వహణపై సంబంధిత మెడికల్ అధికారులు, నియోజకవర్గ స్పెషల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరాల్లో గుర్తించిన రోగులకు వైద్య పరీక్షల నిర్వహణ నామకేవాస్తి చేశామన్న రీతిలో కాకుండా నాణ్యతగా నిర్వహించి చికిత్సలు అందించాలన్నారు. శిబిరాల్లో పెద్ద వ్యాధులకు గురైన బాధితులను రెఫెరల్ ఆస్పత్రులకు పంపడమే కాకుండా వాటిని ఫాలో అప్ చేసే బాధ్యతను డాక్టర్లు తీసుకోవాలన్నారు. వైద్య శిబిరాలకు స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని సూచించారు. అర్బన్, మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో అధిక స్థాయిలో క్యాంపులు నిర్వహించడంతోపాటు నిపుణులైన వైద్యులను కూడా క్యాంపులకు రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వోను ఆదేశించా రు. ఇళ్లకు తాళం వేసిన కుటుంబీ కులకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య శిబిరాలకు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గట్టు శిబిరాల్లో ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శిబిరాల సమీపంలో 108 అంబులెన్స్ వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రోగులకు అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచు కోవడంతో పాటు టెస్టులకు అవసరమైన కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని డాక్టర్లకు సూచించారు. కంటి వెలుగు కింద కాంటాక్ట్ ఆపరేషన్లు చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేయాలని ఆదేశింంచారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలలో 128, అర్బన్ ప్రాంతాలలో 7 వైద్య శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ వైద్య శిబిరాల్లో 58,000 మంది ఓపి నమోదైనట్లు వివరించారు. దీర్ఘకాలిక రోగులను రెఫెరల్ హాస్పిటల్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. 15 రోజులు ముందే ఇంటింటి సర్వే నిర్వహించి సంబంధిత రోగుల డేటాను సేకరించి వైద్య శిబిరాలకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకట రమణ, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ జఫరూళ్ళ, డిఆర్‌ఒ పుల్లయ్య, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, అన్ని నియోజకవర్గాల స్పెషల్ అధికారులు, మెడికల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.