Nov 18,2023 00:19

సమావేశం మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ప్రజాశక్తి-రంపచోడవరం
ఏజెన్సీలోని పేదలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే పేర్కొన్నారు. పేదల్లో రక్తహీనత నివారణ, వివిధ వ్యాధులకు అందించే వైద్య సేవలపై శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఎడిఎం అండ్‌ హెచ్‌ఓ, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో పిఒ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఏజెన్సీలో ఎంత మంది కుష్టు వ్యాధిగ్రస్తులు ఉన్నది పీహెచ్సీల వారిగా ఆరా తీశారు. ఎంతమంది వ్యాధిగ్రస్తులకు స్క్రీనింగ్‌ చేశారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతున్న తీరు, ఏయే వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నదీ వివరాలు సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏడిఎం అండ్‌ హెచ్‌ఓ జి.ప్రకాశం, వైద్యాధికారులు రాధిక, సాయి రతన్‌, వినోద్‌ కుమార్‌, భావన, సంతోష్‌, శిరీషారాణి, నిరంజన్‌, ఎంపిహెచ్‌ఓ పీటర్‌, హెల్త్‌ సెల్‌ ఇన్‌ఛార్జి ఝాన్సీ, సీనియర్‌ అసిస్టెంట్‌ రత్నకుమార్‌ పాల్గొన్నారు.
విద్యార్థులకు ఎనీమియా రాకుండా
ముందస్తు చర్యలు
ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సికిల్‌సెల్‌ ఎనీమియా రాకుండా ముందుగానే గుర్తించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే సంబంధిత అధికారులను ఆదేశించారు. సికిల్‌ సెల్‌ ఎనీమియా నివారణపై శుక్రవారం స్థానిక ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో పిఒ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో ఇప్పటి వరకు ఎంతమందికి హెచ్‌బి టెస్టులు నిర్వహించారు, ఇంకా ఎంతమందికి నిర్వహించాల్సి ఉంది, మైల్డ్‌ మోడరేట్‌ సివియర్‌ మోడల్‌ కేసులు ఎన్ని ఉన్నాయి, సికిల్‌ సెల్‌ ఎనీమియా కేసులు ఎన్ని ఉన్నాయి, ఇప్పటివరకు ఎంతమంది పింఛన్లు పొందుతున్నారు, ఇంకా ఎంత మంది పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు తదితర వివరాలతో నివేదిక పిహెచ్‌సి వారీగా సమర్పించాలని సూచించారు. విద్య, వైద్యశాఖ అధికారులు ఆశ్రమ పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌ రాజ్‌, ఎడిఎంహెచ్‌ఒ జి.ప్రకాశం, ఏటిడబ్ల్యుఓ రామతులసి, ఎంఇఒ ఎంవివి సత్యనారాయణ, వివిధ పిహెచ్‌సిల వైద్యాధికారులు పాల్గొన్నారు.