ప్రజాశక్తి -ఆనందపురం: రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్లు నిర్మించి, మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. మండలంలోని తంగుడుబిల్లి గ్రామంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో 38 లక్షల మందికి, విశాఖ జిల్లాలో లక్షా 40 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించినట్లు చెప్పారు. ఆనందపురం మండలంలో అర్బన్ ఏరియా పేదలకు సుమారు 28 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. తంగుడిబిల్లిలో 16,996 లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు.
భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి కాలనీని సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కాలనీలో రోడ్లు, విద్యుత్తు, తాగు నీరు, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాలు, బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, నాణ్యతతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్‌డిఎ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, 6వ వార్డు కార్పొరేటర్ ప్రియాంక, జివిఎంసి కమిషనర్ లకీëశ, ఎంపిపి శారదా ప్రియాంక, జెడ్‌పిటిసి సభ్యులు కోరాడ వెంకటరావు, నాయకులు బంక సత్యనారాయణ కాకర్లపూడి శ్రీకాంత్ రాజు మజ్జి వెంకటరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.










