Aug 20,2023 00:16

కాజలోని పేదలతో మాట్లాడి అర్జీలు పెట్టిస్తున్న సిపిఎం నాయకులు

మంగళగిరి రూరల్‌: మంగళగిరి రూరల్‌ మండలం కాజా గ్రామంలో పుల్లయ్యనగర్‌, సుందరయ్య నగర్‌, వెంకటరెడ్డి పాలెం చెరువు లో నివాసం ఉంటున్న పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో శనివారం గ్రామంలో గ్రూపు సమావేశాలు నిర్వహించి అర్జీలు పెట్టించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఈమని అప్పారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి పేదలందరికీ ఇళ్ల పట్టాలిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్న ఇంతవరకూ పట్టాలు మంజూరు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్‌ భూముల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలిస్తామని చెప్పిందని , చెరువు పోరంబోకులో నివాసం ఉన్న వారికి కూడా పటాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కాజలో గత నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి ఇంతవరకు ఇళ్ల పట్టాలివ్వలేదని, దీంతో ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వారు అందుకోలేకపోతున్నారని అన్నారు. ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 21వ తేదీ సోమవారం సచివాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భీమిరెడ్డి కోటేశ్వరి, మండల నాయకులు టి .ప్రసాద్‌ రెడ్డి, ఏ. సాంబి రెడ్డి , కే. గోపాల్‌ రెడ్డి, జి. గోపాల్‌ రెడ్డి, బి. సత్యమారెడ్డి, ఎస్‌. రామిరెడ్డి, ఈ. బ్రహ్మారెడ్డి, ఎం .శివయ్య, ఎం. అరుణ తదితరులు పాల్గొన్నారు.